మహోన్నత ప్రజానేత వైఎస్సార్‌: సీఎం | Revanth Reddy Pays Tribute To YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

మహోన్నత ప్రజానేత వైఎస్సార్‌: సీఎం

Jul 8 2026 1:43 AM | Updated on Jul 8 2026 1:43 AM

Revanth Reddy Pays Tribute To YS Rajasekhara Reddy

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలే తన కుటుంబమని భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజా నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. జూలై 8న వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని..  ఆయనను స్మరించుకున్నారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్‌ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.   సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఆయన అమలు చేసిన అనేక పథకాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. 

‘ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర.. ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు, సేవా తపనకు చిరస్మరణీయ నిదర్శనమని ప్రశంసించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యకు ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో వైఎస్‌ తీసుకున్న నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అభివర్ణించారు. 

హైదరాబాద్‌ మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీఎన్‌ఆర్‌ ఫ్లైఓవర్‌ వంటి కీలక మౌలిక వసతుల అభివృద్ధికి వైఎస్‌ తీసుకున్న నిర్ణయాలు.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన విజన్, దూరదృష్టికి నిదర్శనాలని తెలిపారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ప్రజాసేవపై ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యానించారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement