
సీఎం ఇచ్చిన హామీపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందన
ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన ప్రభుత్వ సలహాదారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా వెళుతూ కూలిపోయిన ఇంటిని చూసిన అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తామని భిక్కనూరు లక్ష్మికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విషయంపై ‘రేవంతన్నా.. నన్ను యాది మరువకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురించిన కథనంపై సీఎం స్పందించారు.

ఉన్నతాధికారులను ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు అదే రోజు లక్ష్మి ఇంటికి వెళ్లి ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపుతున్నట్టు చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో లక్ష్మికి ఇల్లు మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రూపుదిద్దుకోవడంతో భిక్కనూరు లక్ష్మితోపాటు చిట్యాల రాజమణి, భిక్కనూరు రేణుకలకు కూడా ప్రత్యేక కేసు కింద ఈ ఏడాది జనవరి 28న ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం ద్వారా మంజూరైన పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లక్ష్మితోపాటు మరో ఇద్దరికి అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి పేపర్ల నాకు సీఎం సారు ఇచ్చిన హామీ గురించి రాసిండ్రు. ఇచ్చిన మాట నిలుపుకున్న రేవంత్‌రెడ్డి సారుకు కృతజ్ఞతలు’ అంటూ భిక్కనూరు లక్ష్మి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
చదవండి: మంత్రి కొండా సురేఖకు అభినందనలు తెలిపిన కేటీఆర్