ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? | Retired ENC Muralidhar Rao Arrested by ACB in Disproportionate Assets Case | Sakshi
Sakshi News home page

ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..?

Jul 16 2025 12:00 PM | Updated on Jul 16 2025 12:20 PM

Retired ENC Muralidhar Rao Arrested by ACB in Disproportionate Assets Case

మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ అరెస్టు నేపథ్యం

ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు

మురళీధర్‌ కుమారుడు అభిషేక్‌ సన్నిహితులపై నిఘా

కాళేశ్వరం ఇంజనీర్లలో ఒక్కొక్కరిపై దాడి..  
    

సాక్షిప్రతినిధి, వరంగల్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్‌సీ (జనరల్‌) చెట్టి మురళీధర్‌రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్‌ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్‌ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. 

కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్‌ కాంట్రాక్ట్‌ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్‌ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్‌లో మురళీధర్‌రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్‌ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్‌ఆర్డర్‌లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్‌రోడ్డు) కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. 

నెక్ట్స్‌ ఎవరో..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌లో కాళేశ్వరం ఈఎన్‌సీ భూక్యా హరిరామ్‌ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు.

 ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నూనె శ్రీధర్‌ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్‌ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్‌ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్‌ వర్గాల్లో సాగుతోంది.

కీలక అధికారుల్లో మొదలైన గుబులు..
వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్‌లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది.

 విజిలెన్స్, ఎన్‌డీఎస్‌ఏ, జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్‌ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement