
పోచారం, బండ్లగూడ, గాజులరామారం ఇళ్లు లాటరీలో విక్రయానికి నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: గతంలో నిర్మించి అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి వేలంలో ఉంచింది. సాధారణ ఫ్లాట్లతోపాటు, అసంపూర్తిగా ఉండిపోయిన ఫ్లాట్లతో కూడిన టవర్లను ఉన్నవి ఉన్నట్టుగా అమ్మకానికి ఉంచింది. గాజులరామారంలో 14 అంతస్తులతో ఉన్న రెండు టవర్లు, పోచారంలో 9 అంతస్తులతో ఉన్న రెండు టవర్లు, బండ్లగూడలో వివిధ కేటగిరీలకు చెందిన 159 ఫ్లాట్లు, పోచారంలో 607 ఫ్లాట్లను లాటరీ ద్వారా విక్రయించనుంది.
పోచారంలో టవర్లు ఇలా....
» పోచారంలో 1,470–1,606 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన 122 ఫ్లాట్లున్న 3,287 చదరపు గజాల విసీర్ణంలో నిర్మించిన 9 అంతస్తుల టవర్‌ను రూ.30 కోట్ల ధరకు (ధరావతు రూ.2 కోట్లు) విక్రయించనుంది.
» 1,125–1,261 చ.అ. విస్తీర్ణంతో కూడిన 72 ఫ్లాట్లున్న 1,396 చ.గ. విస్తీర్ణంలో నిర్మించిన మరో టవర్‌ను రూ.13.78 కోట్లకు (ధరవాతు రూ.కోటి) అమ్మకానికి ఉంచింది.
» 1,150–1,232 చ.అ. విస్తీర్ణంతో వివిధ కేటగిరీలతో కూడిన 112 ఫ్లాట్లున్న 6,720 చ.గ. విస్తీర్ణంలో నిర్మించిన టవర్‌ను రూ.26.33 కోట్లకు (ధరావతు రూ.2 కోట్లు), 1,150–1,232 చ.అ. విస్తీర్ణం, వివిధ కేటగిరీలతో కూడిన 112 ఫ్లాట్లున్న 6847 చ.గ. విస్తీర్ణంలో నిర్మించిన మరో టవర్‌ను రూ.26.33 కోట్లకు (ధరావతు రూ.2 కోట్లు) విక్రయించనుంది. గాజులరామారం, పోచారం టవర్లకు ఆగస్టు 19లోపు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 20న హిమాయత్‌నగర్‌లోని గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో లాటరీ నిర్వహిస్తారు.
బండ్లగూడలో ఫ్లాట్లు ఇలా...
బండ్లగూడలోని సహభావన టౌన్‌షిప్‌లో 1,487, 1,617 చ.అ. విస్తీర్ణంలో ఉన్న 3 బీహెచ్‌కే డీలక్స్ ఫ్లాట్లు రూ.49 లక్షల కనీస ధరకు అమ్మబోతోంది.
» 1,141, 1,266 చ.అ. విస్తీర్ణంలోని 3 బీహెచ్‌కే ఫ్లాట్లను రూ.38 లక్షల కనీస ధరకు, 798 చ.అ. విస్తీర్ణంలోని 2 బీహెచ్‌కే కనీస ధర రూ.22 లక్షలు, 545 చ.అ. విస్తీర్ణంలోని 1 బీహెచ్‌కే కనీస ధర రూ.15 లక్షలు, 645 చ.అ. విస్తీర్ణంలోని సీనియర్ సిటిజన్ ఫ్లాట్ కనీస ధర రూ.18 లక్షలుగా నిర్ధారించారు. బండ్లగూడ ఫ్లాట్లకు ధరావతును జూలై 29లోపు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ 30న ఉంటుంది.
పోచారంలో ఫ్లాట్లు ఇలా...
» పోచారంలో1,400–1,600 చ.అ. 3 బీహెచ్‌కే డీలక్స్ ఫ్లాట్ల కనీసం ధర రూ.34 లక్షలు, 1,150–1,250 చ.అ. 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు కనీస ధర రూ.27 లక్షలు, 761 చ.అ. 2 బీహెచ్‌కే ఫ్లాట్ల కనీస ధర రూ.19 లక్షలు, 523 చ.అ. 1బీహెచ్‌కే ఫ్లాట్ల కనీస ధర రూ.13 లక్షలుగా నిర్ధారించారు. పోచారం ఫ్లాట్లకు జూలై 31లోపు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ ఆగస్టు 1న ఉంటుంది.
కేపీహెచ్‌బీ–హైటెక్‌సిటీ కారిడార్‌లో అమ్మకానికి 7.3 ఎకరాల భూమి
భారీ ఆకాశహర్మ్య నిర్మాణానికి అనువైన ఏడెకరాల భూమిని తెలంగాణ గృహనిర్మాణ మండలి అమ్మకానికి ఉంచింది. గతంలో కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి భూములు కేటాయించగా మిగిలిన ఏడెకెరాల భూమిని గృహనిర్మాణ మండలి అలాగే కాపాడుకుంటూ వచ్చింది. ఆ ప్రాంతంలో భారీ ఆకాశహర్మ్యాలు వెలుస్తున్న తరుణంలో, అలాంటి ప్రాజెక్టు చేపట్టే సంస్థకు భూమిని వీలైనంత ఎక్కువ ధరకు కట్టబెట్టాలని బోర్డు నిర్ణయించింది.
ఈ మేరకు దాన్ని వేలంలో ఉంచుతూ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని విక్రయం ద్వారా దాదాపు రూ.650 కోట్ల వరకు సమకూరుతుందని గృహనిర్మాణ మండలి అంచనా వేస్తోంది. ఇక్కడ గజం ధర రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. ఇలాంటి కీలక ప్రాంతంలో ఉన్న ఈ 7.3 ఎకరాల భూమి కోసం బడా సంస్థలు బిడ్లు దాఖలు చేసే వీలుంది.
» కేపీహెచ్‌బీలో 4,598, 2,420 చదరపు గజాల రెండు కమర్షియల్ ప్లాట్లు, నాంపల్లిలో 1,148.30 చదరపు గజాల ప్లాట్‌ను కూడా వేలంలో ఉంచింది. వీటికి ఈ నెల 30న వేలం జరగనుంది. పూర్తి వివరాలను తెలంగాణ గృహనిర్మాణ మండలి(హౌసింగ్‌బోర్డు) వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.