ఈ నెలాఖరుకు దాని బడ్జెట్‌ను ఆమోదించనున్న కేంద్ర పీపీపీఏసీ కమిటీ
ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్‌ఆర్ టెండర్లకు ఎట్టకేలకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 162 కి.మీ. ఉత్తర రింగు నిర్మాణానికి ఈ నెలాఖరున బడ్జెట్ ఖరారు చేయబోతోంది. దీనికి కేంద్ర పబ్లిక్,ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఈ నెలాఖరున ఆమోదముద్ర వేయనుంది. దీంతో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను గుర్తించి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమవుతోంది. రింగు ఉత్తర భాగానికి దాదాపు రూ.18,600 కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ బడ్జెట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం టెండర్లను కూడా పిలిచారు. కానీ, బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవటంతో టెండర్లను తెరవలేకపోయారు.
ఆరు నెలల్లో పనులు ప్రారంభం...
గత నెలలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటీ కమిటీ ఉత్తర రింగు సాంకేతిక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా కొన్ని చిన్నచిన్న మార్పులను సూచించింది. ఆ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ మార్పులు చేసి పీపీపీఏసీ ఆమోదం కోసం పంపింది. ఈ నెలాఖరున మరో ఎనిమిది రోడ్లతోపాటు దీనిపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసేందుకు అంగీకరించింది. ఆర్థిక, ప్రణాళిక, న్యాయ శాఖల కార్యదర్శులతోపాటు నీతిఆయోగ్ ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారు. వీరు ప్రాజెక్టు పూర్వాపరాలను పరిశీలించి బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయటంతో నిధుల కేటాయింపునకు మార్గం సుగమమవుతుంది.
నిధుల కేటాయింపు లేకుండా ప్రాజెక్టు టెండర్లు తెరవటం సాంకేతికంగా కుదరనందున ఇన్ని నెలలుగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆరు నెలల క్రితమే టెండర్లు పిలిచినా, ఆ తర్వాత రోడ్డు నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకుంది. తొలి విడతలో ఉత్తర భాగం రింగురోడ్డులో నాలుగు వరుసలను మాత్రమే నిర్మించాలని నిర్ణయించినందున, దానికే టెండర్లు పిలిచారు. కానీ, రోడ్డు నిర్మాణంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ... తొలి విడతలో ఒకేసారి ఆరు వరుసలు నిర్మించాలని సూచించింది.
దీంతో ఆ మేరకు టెండర్ డాక్యుమెంట్‌లో వివరాలు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థిక పరమైన అంశాలకు ఆమోదం లభిస్తున్నందున.. దాఖలైన టెండర్లను తెరిచి నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. అక్కడి నుంచి ఆరు నెలల గరిష్ట గడువు ఉంటుంది. మే నెలలో నిర్మాణ సంస్థ రోడ్డు పనులు ప్రారంభించనుంది. ఆరు ప్యాకేజీలుగా పనులు ప్రారంభమవుతాయి.
ఔటర్ రింగ్ రైలు.. దక్షిణ రింగులపై సందిగ్ధత
రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి 100 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2 వేల హెక్టార్ల భూమిని సేకరించారు. దానికి పరిహార చెల్లింపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ వంద మీటర్లలోనే కొంత భాగాన్ని ప్రతిపాదిత ఔటర్ రింగు రైలు కోసం కేటాయించాలని రైల్వే శాఖ కోరింది. అలా చేస్తే..రింగురోడ్డుకు భూమి కొరత ఏర్పడి రోడ్డు డిజైన్ మొత్తాన్ని మార్చుకోవాల్సి వస్తుందని, అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినందున, రింగురైల్ కోసం విడిగా భూమిని సేకరించుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు దక్షిణ రింగు భాగాన్ని కూడా ఉత్తర రింగుతోపాటే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దక్షిణ రింగు కోసం సొంతంగా ఓ అలైన్‌మెంట్‌ను కూడా ఖరారు చేసి కేంద్రానికి పంపింది. సాధారణంగా తన నిధులతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వమే అలైన్‌మెంట్ రూపొందించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అలైన్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోదు. దీంతో ఇప్పుడు దక్షిణ భాగానికి సంబంధించిన వ్యవహారం కొంత గందరగోళంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అలైన్‌మెంట్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో స్పష్టత రాలేదు.


