
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్-బొల్లారం రోడ్డులో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. జేబీఎస్ నుంచి ఓఆర్‌ఆర్ వెళ్లడానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. గంటల తరబడి ఆర్టీసీ బస్సులు నెమ్మదిగా కదలడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.
‘రాఖీ స్పెషల్’ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు చేయడంతో జూబ్లీ బస్టాండ్, జేపీఎస్ నుంచి మహిళలు తమ స్వస్థలాలకు భారీ సంఖ్యల్లో వెళ్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో బస్సుల్లో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నారు. అదనంగా మరికొన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీని కోరుతున్నారు.
మరో వైపు, భాగ్యలత నుంచి హయత్‌నగర్ వరకు కూడా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. రాఖీ పండుగ, వారాంతం కారణంగా ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, బోయిన్‌పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్ పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో పలు చోట్ల కిలో మీటర్లు ప్రయాణానికి గంటన్నర సమయం పడుతోంది.