పదేళ్లయినా విస్తరించని కవచ్‌! | Railways Kavach train collision prevention system on only 1465 route km: Govt | Sakshi
Sakshi News home page

పదేళ్లయినా విస్తరించని కవచ్‌!

Published Wed, Nov 1 2023 4:08 AM | Last Updated on Wed, Nov 1 2023 4:08 AM

Railways Kavach train collision prevention system on only 1465 route km: Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వందేభారత్‌... వేగవంతమైన, ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన రైలు. కానీ వేగంగా, విలాసవంతంగా ప్రయాణించడం కంటే రైళ్లు భద్రంగా గమ్యస్థానం చేరడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని విస్మరించిన రైల్వే శాఖ... రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్‌ వ్యవస్థను విస్తరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురై ఏకంగా 296 మంది ప్రయాణికులు దుర్మరణం పాలై నాలుగున్నర నెలలు దాటినా నేటికీ కవచ్‌ వ్యవస్థను కొత్తగా ఒక్క కిలోమీటర్‌ మేర కూడా అందుబాటులోకి తీసుకురాలేదు.

ఒకవేళ ఆ వ్యవస్థను విస్తరించి ఉంటే తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన తప్పి ఉండేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో కేవలం 5 డీజిల్‌ లోకొమోటివ్‌లలో దీన్ని ఏర్పాటు చేయడం తప్ప ఎలాంటి పురోగతీ లేదు. ఏటా 5 వేల కి.మీ. మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇటీవల 3 వేల కి.మీ. మేర దీన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కానీ పనుల్లో వేగం లేదు.

టీకాస్‌ నుంచి కవచ్‌గా రూపాంతరం...
రైల్వే అనుబంధ పరిశోధన సంస్థ రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌ఓ) 2013లో తొలుత రైల్‌ కొలీజన్‌ అవాయ్‌డెన్స్‌ సిస్టం (టీకాస్‌)ను సిద్ధం చేసింది. ప్రయోగాల కోసం వికారాబాద్‌–వాడీ–సనత్‌నగర్‌ సెక్షన్‌లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. 260 కి.మీ. నిడివిలో ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిశీలించింది. ఆరేళ్ల క్రితం దాని పేరును కవచ్‌గా మార్చింది.

2022 నాటికి కవచ్‌ ఎక్కడెక్కడంటే..

  • నాందేడ్‌–నిజామాబాద్‌–సికింద్రాబాద్‌–కర్నూలు–గుంతకల్‌ మార్గంలో 960 కి.మీ.
  • పర్బణి–పర్లివైజ్‌నాథ్‌–లాతూర్‌–వికారాబాద్‌ మార్గంలో 31 కి.మీ.
  • వాడి–వికారాబాద్‌–సనత్‌నగర్‌ మార్గంలో 174 కి.మీ.
  • ఇవి తప్ప, దేశంలోని మిగతా ప్రాంతాల్లో వీటి ఏర్పాటు జరగలేదు.

కవచ్‌ పనితీరు ఇలా...
ప్రత్యేక కవచ్‌ యంత్రాలను రైల్వే స్టేషన్‌లలో, రైళ్లలో అమరుస్తారు. ట్రాక్‌పై ప్రతి కి.మీ.కు ఒకటి చొప్పున ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లను ఏర్పాటు చేస్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల కోసం నిర్ధారిత ప్రాంతాల్లో 40 మీటర్ల ఎత్తున్న టవర్లను ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్‌ టవర్, జీపీఎస్, రేడియో ఇంటర్‌ఫేస్‌లతో అనుసంధానిస్తారు. దీంతో ఎప్పటికప్పుడు ఇవి రైళ్లను నియంత్రిస్తుంటాయి. లోకో పైలట్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినా తనంతట తనుగా బ్రేక్‌లు వేసుకోవటం, హారన్‌ మోగించటం లాంటివి కవచ్‌ చేయగలదు. పొరపాటున ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వస్తే.. కనీసం 100 మీటర్ల దూరంలోనే అవి ఆటోమేటిక్‌గా నిలిచిపోతాయి.

వందేభారత్‌లకూ పొంచి ఉన్న ప్రమాదం..
గంటకు 160 కి.మీ.వేగంతో (నిర్ధారిత పరిధి) దూసుకుపోతున్న వందేభారత్‌ రైళ్లలోనూ కవచ్‌ వ్యవస్థ లేదు. అవి పరుగుపెట్టే ట్రాక్‌ మొత్తం కవచ్‌ వ్యవస్థ ఏర్పాటైతేనే పనిచేసే పరిస్థితి ఉన్నందున వందేభారత్‌ రైళ్లు కూడా ఎదురెదురుగా ఇతర రైళ్లను ఢీకొనే ప్రమాదపు అంచులో ఉన్నట్టే. 

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌..పరిజ్ఞానం: దేశీయం
నేపథ్యం: 2016 చివర్లో తయారీపై మొదలైన ప్రయోగాలు 2018 నాటికి పూర్తి. అందుకే దీన్ని తొలుత ‘ట్రైన్‌–18’గా పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ఢిల్లీ–వారణాసి మధ్య తొలి రైలు పరుగు ప్రారంభించింది. ఆలోచన నుంచి పట్టాలెక్కడం వరకు పట్టిన సమయం కేవలం రెండున్నరేళ్లు.
ఖర్చు: ఒక్కో రైలు తయారీకి అవుతున్న వ్యయం దాదాపు రూ. 100 కోట్లు.

కవచ్‌
ఒకే ట్రాక్‌ మీదకు రెండు రైళ్లు వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా నిరోధించేందుకు అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా రూపొందించిన వ్యవస్థ.
పరిజ్ఞానం: దేశీయం
నేపథ్యం: 2013లో ప్రయోగాలు మొదలు. అవి విజయవంతం కావడంతో ఆ వ్యవస్థను వినియోగించేందుకు 2021లో అనుమతి. ప్రస్తుతం భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ 1.29 లక్షల కి.మీ. మేర విస్తరించి ఉంది. కానీ కవచ్‌కు అంకురార్పణ జరిగి దశాబ్దం దాటుతున్నా ఇప్పటివరకు ఏర్పాటైంది కేవలం 1,425 కి.మీ. నిడివిలోనే.ఖర్చు: కిలోమీటర్‌కు రూ.50 లక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement