యూనివర్సిటీల్లో కేసీఆర్‌ ఫెలోషిప్‌ | Proposal For Fellowship In The Name Of KCR To Phd Students | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీల్లో కేసీఆర్‌ ఫెలోషిప్‌

Mar 7 2022 4:05 AM | Updated on Mar 7 2022 9:33 AM

Proposal For Fellowship In The Name Of KCR To Phd Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేరు మీద ఫెలోషిప్‌ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏ ఇతర ఆర్థికసాయం పొందని విద్యార్థులకు దీన్ని అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ‘కేసీఆర్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌’ పేరుతో దీన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అన్ని యూనివర్సిటీలు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాయి. ఈ ఫెలోషిప్‌ అమలుకు ఏటా రూ. 5 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించాలని ప్రభుత్వాన్ని కోరాయి.

ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎంఫిల్‌ తర్వాత పీహెచ్‌డీ చేసేవారికి గతంలో ‘రాజీవ్‌ గాంధీ ఫెలోషిప్‌’ఇచ్చేవాళ్లు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి ఆయా సామాజికవర్గాల పీహెచ్‌డీ స్కాలర్స్‌ ఈ ఫెలోఫిప్‌లను అందుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల కొన్ని వర్గాల విద్యార్థులు ఏ విధమైన స్కాలర్‌షిప్‌లనూ పొందలేకపోతున్నారు. ఇలాంటివాళ్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేలమంది వరకూ ఉంటారు. గత కొన్నాళ్లుగా పీహెచ్‌డీకి కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చుకోవడం వారికి కష్టంగా మారింది.

ముఖ్యంగా సైన్స్‌ విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పీహెచ్‌డీకి అవసరమైన రసాయనాలు, ప్రయోగ పరికరాలు, ఇతర గ్రంథాలరేట్లు విపరీతంగా పెరిగాయి. సొంత ఖర్చులతో వీటిని సమకూర్చుకోవడంలో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్కాలర్‌షిప్‌ అందిస్తే బాగుంటుందని యూనివర్సిటీలు ప్రతిపాదించాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్యరూపం దాల్చేవీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  


ఆర్థిక తోడ్పాటు అవసరం
రాష్ట్రంలో చాలామంది పీహెచ్‌డీ విద్యార్థులు ఏ రకమైన ఫెలోషిప్‌ అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేసీఆర్‌ ఫెలోషిప్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇది అమలులోకి వస్తే కీలకమైన పీహెచ్‌డీల్లో మంచి పురోగతి ఉంటుంది. ఫెలోషిఫ్‌ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని మేం భావిస్తున్నాం. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నాం.   
–ప్రొ.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement