సిటీ.. గో గ్రీన్‌ | Propensity of city dwellers for eco-friendly dwellings | Sakshi
Sakshi News home page

సిటీ.. గో గ్రీన్‌

Published Sat, Jun 15 2024 4:44 AM | Last Updated on Sat, Jun 15 2024 4:44 AM

Propensity of city dwellers for eco-friendly dwellings

20-30% విద్యుత్‌ ఆదా, 30-40% నీరు ఆదా

స్కూళ్లు, ఐటీ టవర్లు, రైల్, మెట్రోస్టేషన్లు కూడా గ్రీన్‌గానే

ప్రస్తుతం హైదరాబాద్‌లో 114 కోట్ల చదరపు అడుగుల్లో 890 ప్రాజెక్టులు 

పర్యావరణహితమైన నివాసాలకు నగరవాసుల మొగ్గు 

హరితభవనాలుగా నివాస, వాణిజ్య, కార్యాలయాలు
స్వచ్ఛమైన గాలి.. ఫుల్‌ వెంటిలేషన్‌.. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. ఇలా ప్రకృతితో కలిసి జీవించడం అంటే కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి మహానగరంలో కష్టమే. స్థలాభావం, నిర్మాణ వ్యయం, నిర్వహణ భారం ఇలా కారణాలనేకం. కానీ కరోనా తర్వాత నివాసితుల అభిరుచి మారింది. ఇళ్లు, ఆఫీసు, షాపింగ్‌మాల్,మెట్రోరైల్‌.. ఇలా ఒకటేమిటి ప్రతీది హరితంగానే ఉండాలని కోరుకుంటున్నారు.  సాక్షి హైదరాబాద్‌

హరిత భవనాల్లో ఏముంటాయంటే..
సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్‌ బిల్డింగ్స్‌తో 20–30 శాతం విద్యుత్, 30–40 శాతం నీరు ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. జీవవైవిధ్యం, సహజ వనరుల పరిరక్షణతో మెరుగైన గాలి నాణ్యత, ఆహ్లాదకరమైన వాతావరణంతో నివాసితులు ఆరోగ్యంగా ఉంటారు. ల్యాండ్‌ స్కేపింగ్, వరి్టకల్‌ గార్డెనింగ్, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్, ఎస్‌టీపీ, రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉండాలి.

షేక్‌పేట, కోకాపేట, నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, శామీర్‌పేట, పటాన్‌చెరు ఇలా నగరం నలువైపులా ఈ హరిత భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రీన్‌ బిల్డింగ్స్‌ ధరలు విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.4,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణాలు 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటున్నాయి.

హైదరాబాద్‌లో 890 ప్రాజెక్టులు
2001లో దేశంలో 20 వేల చదరపు అడుగుల్లో (చ.అ.)కేవలం ఒక్కటంటే ఒక్కటే హరిత భవనం ఉండగా, ప్రస్తుతం 1,175 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 13,722 భవనాలు ఉన్నాయి. ఇందులో 120కు పైగా నెట్‌జీరో బిల్డింగ్‌లే ఉన్నాయి. హైదరా బాద్‌లో 114 కోట్ల చ.అ.ల్లో 890 ప్రాజెక్టుల పరిధిలో హరిత భవనాలుండగా, ఇందులో నివాస, వాణిజ్య భవనాలే కాదు స్కూళ్లు, ఫ్యాక్టరీలూ ఉన్నాయి. అపర్ణాసరోవర్, రెయిన్‌బో విస్టాస్, మైహోమ్‌ అవతార్, బీహెచ్‌ఈఎల్‌ ఎంప్లాయ్‌ సైబర్‌ కాలనీ, రహేజా విస్టాస్‌లు  గ్రీన్‌ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి.

తొలిముద్ర నగరానిదే..
⇒ హరిత భవనాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేకస్థానం. గృహాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, రైలు, మెట్రోస్టేషన్లు, ఫ్యాక్టరీలు, ఐటీ టవర్లు, విద్యాసంస్థలు ఇలా 31 విభాగాలలో హరిత భవనాలకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) రేటింగ్‌ ఇస్తుంది. వీటిల్లో తొలి రేటింగ్‌ పొందిన భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి.  

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్‌ స్టేషన్‌గాగుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరితభవనంగా గచి్చ»ౌలిలోని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ నిలిచింది.  

⇒  ప్రపంచంలో మొదటి గ్రీన్‌ ప్యాసింజర్‌ టెరి్మనల్‌గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది.  

⇒ తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గ్రీన్‌ బిల్డింగ్‌ గుర్తింపు దక్కగా, కొత్తగా నిర్మించిన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం కూడా ఐజీబీసీ రేటింగ్స్‌ అందుకున్నాయి.

రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా.. 
హరిత భవనాలను ప్రోత్సహించేందుకు దేశంలో 11 రాష్ట్రాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పరి్మట్‌ ఫీజులో 20 శాతం, స్టాంప్‌ డ్యూటీ సర్‌చార్జ్‌లో 20 శాతం తగ్గుదల ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ ప్రమోషన్‌ (డీఐపీపీ), కేంద్ర పరిశ్రమ శాఖ నుంచి రూ.2 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఉంది. సిడ్బీ బ్యాంక్‌ నుంచి వడ్డీ రేట్లలో మినహాయింపు కూడా ఉంది. ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు, ఐటీ టవర్లు, రైలు, మెట్రోస్టేషన్లు ఇలా 31 విభాగాల్లో తొలి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో హరితభవనాలకు ప్రభుత్వం నుంచి రాయితీ, ప్రోత్సాహకాలు లేవు.

తెలంగాణలో ఐజీబీసీ ప్రాజెక్టులలో కొన్ని..
⇒  దుర్గంచెరు, పంజగుట్ట, ఎల్బీనగర్‌ సహా 17 మెట్రోస్టేషన్లు 
⇒  సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, రైల్వే నిలయం 
⇒ కాచిగూడ రైల్వేస్టేషన్‌ 
⇒ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ గ్రీన్‌ విలేజ్‌ 
⇒ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 
⇒ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం 
⇒ సిద్దిపేట, నిజామాబాద్‌ ఐటీ టవర్లు 
⇒ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట) 
⇒ ఇనార్బిట్‌ మాల్, నెక్సస్‌ షాపింగ్‌మాల్‌
⇒ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, జేయూఎన్‌టీయూహెచ్‌ (సుల్తాన్‌పూర్‌) 
⇒ క్యాప్‌జెమినీ కార్యాలయం 
⇒ హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫ్యాక్టరీ (తూంకూరు) 
⇒ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

గ్రీన్‌ బిల్డింగ్స్‌ ఉద్యమంలా చేపట్టాలి 
ఏ తరహా నిర్మాణాలైనా సరే హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్‌ బిల్డింగ్స్‌ను బిల్డర్లు ఉద్యమంలా నిర్మించాలి. హరిత భవనాల గురించి నగరంతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలకు అవగాహన కలి్పంచేలా పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలి.   - శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడు

హరిత భవనాలను కోరుకుంటున్నారు 
హరిత భవనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇంటికి రాగానే చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుండటంతో గ్రీన్‌ బిల్డింగ్స్‌లను కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.   - ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్‌
ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement