సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకోసం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు ఫలప్రదమ య్యాయి. దీంతో విద్యాసంస్థల బంద్‌ను విరమిస్తున్నట్టు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సమాఖ్య (ఫతి) ప్రకటించింది. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంటున్నట్టు సమాఖ్య వెల్లడించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ నెల 3వ తేదీ నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రూ.1,500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సమాఖ్య కోరగా, ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేశామని, మరో రూ.600 కోట్లు నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని, తర్వాత రూ.300 కోట్లు దశలవారీగా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికను త్వరితగతిన వచ్చేలా చూస్తామని, అవసరమైన సంస్కరణలు చేపడతామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేనపై తాము ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, ఈ అంశాన్ని మీడియా వక్రీకరించి రాసిందని (సాక్షి కాదు) ఫతి అధ్యక్షుడు నిమ్మటూరి రమేశ్‌బాబు ఉప ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి ప్రతినెలా ఎంతో కొంత తప్పనిసరిగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు ఫతి నేతలు తెలిపారు.


