‘డబ్బు’ల్‌ దోపిడి.. బస్సెక్కాలంటే భయమేస్తోంది

Private Bus Travels Collects Double Rate Ticket Price Ts Andhra pradesh lockdown - Sakshi

ప్రైవేట్‌ బస్సుల్లో ఇష్టారాజ్యంగా టికెట్‌ రేట్లు 

లాక్‌డౌన్‌ నెపంతో రెట్టింపు చార్జీలు వసూలు 

హైదరాబాద్‌ నుంచి ఏపీ కి వెళ్లే  బస్సుల్లో  మరీ ఎక్కువ 

హైదరాబాద్‌ టూ విజయవాడ రూ.2000 నుంచి రూ.2500 

సాధారణ రోజుల్లో  రూ.650 నుంచి రూ.1000  

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ఊళ్లకు వెళ్లే  ప్రయాణికులపైన రెట్టింపు భారం మోపుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ రోజుల్లో విధించే చార్జీలపైన మూడింతలు వసూలు చేస్తున్నారు. ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో  ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చార్జీలను అమాంతంగా పెంచేస్తున్నారు. ఇక స్లీపర్‌ క్లాస్‌ బస్సుల్లో విమాన చార్జీలను తలపిస్తున్నాయి.

సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు నాన్‌ ఏసీ బస్సుల్లో రూ.650 వరకు ఉంటే ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. ఏసీ బస్సుల్లో రూ.2000 నుంచి రూ.2500 వరకు చార్జీలు ఉన్నాయి. స్లీపర్‌ సదుపాయం ఉన్న ఏసీ బస్సుల్లో మాత్రం రూ.3000 పైనే తీసుకుంటున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అర్జెంట్‌గా విజయవాడకు వెళ్లవలసి వచ్చింది. అప్పటికప్పుడు ట్రైన్‌లో వెళ్లే అవకాశం లేదు.దీంతో ప్రైవేట్‌ ఏసీ బస్సెక్కాను. రూ.2200 తీసుకున్నారు... అని మల్కాజిగిరికి చెందిన సతీష్‌ ఆందోళన  వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ, ఏపీల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో  రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఈ అవకాశాన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్‌ బస్సులతో పాటు, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ట్రావెల్స్‌ కార్లు, మ్యాక్సీ క్యాబ్‌లలోనూ అడ్డగోలు దోపిడీ కొనసాగుతోంది.  

సడలింపు వేళలే అవకాశంగా.... 
►రెండు రాష్ట్రాల్లో సడలింపు వేళలను అవకాశంగా చేసుకొని ప్రైవేట్‌ బస్సులు నడుస్తున్నాయి.  
►ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో  తప్పనిసరి పరిస్థితుల్లో  ప్రయాణం చేయవలసిన వాళ్లు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  
►ఏపీలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తెలంగాణలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లాక్‌డౌన్‌ వేళలను సడలించడంతో పాటు మరో గంట సమయం ప్రజలు ఇళ్లకు     చేరుకొనేందుకు  వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.  
►ఈ సడలింపు సమయానికి అనుగుణంగానే ప్రైవేట్‌ బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ట్రావెల్స్‌ సంస్థలు పోటా పోటీగా బస్సులు నడుపుతున్నాయి.  
►బస్సుల్లో పెద్దగా ఆక్యుపెన్సీ లేకపోయినా కరోనా సమయంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను దాటిస్తున్న  నెపంతో  ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.  
►ఒక ట్రావెల్స్‌ సంస్థ చార్జీలకు, మరో సంస్థ చార్జీలకు మధ్య ఎలాంటి పొంతన ఉండడం లేదు.    

ప్రత్యేక అనుమతుల పేరిట వసూళ్లు... 
ప్రైవేట్‌ బస్సుల్లో పరిస్థితి ఇలా ఉంటే, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు  మరో విధంగా దోపిడీకి తెర లేపాయి. పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద  ప్రత్యేక అనుమతులు తీసుకొని బండ్లు నడుపుతున్నట్లు చెప్పి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నా యి. ఎల్‌బీ నగర్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వందలాది క్యాబ్‌లలో ఈ తరహా దోపిడీ కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో రూ.1000 వరకు డిమాండ్‌ చేస్తే ఇప్పుడు  రూ.2500 పైనే వసూ లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందే గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో అడిగినంత చెల్లించవలసి వస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు.  
తగ్గిన రైళ్లు... 
కరోనా  సెకెండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో దక్షిణమధ్య రైల్వే  ప్రత్యేక రైళ్ల ను భారీగా రద్దు చేసింది. ఈ నెల 16వ తేదీ వరకు రెండు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే సుమారు 25 రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే మరో 20 రైళ్లను కూడా రద్దు చేశారు. దీంతో తప్పనిసరిగా బయలుదేరవలసిన వాళ్లు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. 

చదవండి: రూ. 300 కోసం.. రూ.1.90 లక్షలు పోగొట్టుకున్న యువతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top