
సాక్షి, హైదరాబాద్: పడకలు లేవంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల బండారం బట్టబయలైంది. కరోనా సేవలకు తమ వద్ద పడకలు లేవంటూ చాలా ఆసుపత్రులు బాధితులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో అనేకమంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం పడకల వివరాలను విడుదల చేసింది... రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, 57 ప్రభుత్వ ఆసుపత్రులు కరోనా వైద్యసేవలు అందిస్తున్నాయి. వాటన్నింటిలో సాధారణ పడకలు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలు అన్నీ కలిపి 12,943 వరకు ఉన్నాయి. అందులో ప్రైవేట్, కార్పొరేట్, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 4,497, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,446 పడకలను కరోనా వైద్యం కోసం కేటాయించారు.
ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న 4,497 పడకలకుగాను 3,032 నిండిపోగా, ఇంకా 1,465 పడకలు(32.57 శాతం) ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న 8,446 కరోనా పడకల్లో 2,242 నిండిపోగా, ఇంకా 6,204(73.45 శాతం) పడకలు ఖాళీగా ఉన్నాయని సర్కారు వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 7,669 పడకలు (59.25%) ఖాళీగా ఉండటం గమనార్హం. ఇన్ని పడకలు ఖాళీగా ఉన్నా రోగులకు బెడ్స్ ఇవ్వకపోవడం, కొందరు మరణాల అంచుకు చేరడం గమనార్హం. వాస్తవంగా రాష్ట్రంలో 13,753 మంది మాత్రమే కరోనా పాజిటివ్ వ్యక్తులు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది ఇంట్లో లేదా ఇతరత్రా ఐసోలేషన్లో ఉన్నారు. ఇంకా మిగిలిన 5,294 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయినా ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 7,669 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పడకలు అందుబాటులో లేవంటూ చాలామందిని ఇబ్బంది పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
సిబ్బందిలేక పడకలు లేవంటున్న యాజమాన్యాలు : ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు లేవని చెప్పడానికి ప్రధాన కారణం సిబ్బంది లేకపోవడమేనన్న వాదనలు ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఇటీవల 30 మంది నర్సులు రాజీనామా చేశారు. ఇతరచోట్లా కూడా తక్కువ వేతనాలకు పనిచేయడానికి వైద్యసిబ్బంది ముందుకు రావడంలేదు. అంతెందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన గచ్చిబౌలిలోని టిమ్స్‌ను ప్రభుత్వం కరోనా రోగుల చికిత్స కోసం సిద్ధం చేసింది. కానీ, అందులో ఇంకా పూర్తిస్థాయిలో కరోనా సేవలు ప్రారంభం కాలేదు.
అక్కడ 129 మెడికల్ ఆఫీసర్ల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీచేసినా కేవలం 40 మంది మాత్రమే చేరారు. అలాగే 246 నర్సు పోస్టులకు కేవలం 200 మంది చేరారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 1,465 పడకలు ఖాళీగా ఉన్నా, పడకలు లేవంటున్నారంటే దానికి ప్రధాన కారణం వైద్య సిబ్బంది కొరతేనని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది చాలావరకు చాలీచాలని వేతనాలతో అసంతృప్తిగా ఉన్నారు. వీరికి రూ.15 వేల లోపే ఇస్తున్నారు. పైగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తక్కువ వేతనంతో పనిచేయాల్సిన అవసరం లేదన్న భావన వారిలో నెలకొంది. మరోవైపు చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ప్రైవేట్ ఆరోగ్య బీమాను పట్టించుకోవడం లేదు. డబ్బులు చెల్లిస్తేనే బెడ్ ఇస్తున్నాయి. లేకుంటే వెళ్లగొడుతున్నాయి.