
7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ ముగింపులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘జైలు వ్యవస్థ కేవలం భద్రతకే పరిమితం కాకుండా..సంస్కరణలు, పునరావాసానికి వేదికగా మారుతోంది’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చి వారిని మళ్లీ సమాజంలో పంపడమే జైళ్లశాఖ అసలు విజయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 9 నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ జైళ్లశాఖ, బీపీఆర్‌అండ్‌డీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 7వ ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్–2025 గురువారంతో ముగిసింది.
ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథి బండి సంజయ్, విశిష్ట అతిథి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా, బీపీఆర్‌అండ్‌డీ అడిషనల్ డీజీ రవిజోసెఫ్ లోకూర్, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్‌గార్గ్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషబిస్త్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్‌లో అత్యధిక ట్రోఫీలతో తెలంగాణ జైళ్లశాఖ జాతీయస్థాయిలో కీర్తి చాటిందన్నారు. జాతీయస్థాయి పోటీలను ఎంతో ఘనంగా నిర్వహించారని సౌమ్యామిశ్రాను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ జైళ్లశాఖను రోల్‌మోడల్‌గా తీసుకోవాలి : పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నో అంశాల్లో సంస్కరణలతో ముందుకు వెళుతున్న తెలంగాణ జైళ్ల శాఖను దేశవ్యాప్తంగా రోల్‌మోడల్‌గా తీసుకోవాలన్నారు. జాతీయస్థాయిలో డ్యూటీ మీట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ జైళ్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నట్టు తెలిపారు.
– తెలంగాణ జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ మూడు రోజుల డ్యూటీమీట్‌లో 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,300 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.
జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ జైళ్లశాఖ
మూడు రోజులుగా తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన డ్యూటీ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా తెలంగాణ జైళ్ల శాఖ సత్తా చాటింది. అన్ని అంశాల్లో కలిపి మొత్తం 28 పతకాలు సాధించగా..అందులో 21 బంగారు పతకాలు, 4 వెండి పతకాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. తమిళనాడు 17 పతకాలతో రెండో స్థానం, 16 పతకాలతో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి.