తెలంగాణ: భద్రాద్రికి రాష్ట్రపతి రాక.. భద్రత కట్టుదిట్టం.. 144 సెక్షన్‌ విధింపు

President Murmu to visit Bhadradri Temple on Wednesday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. 

బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్‌ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్‌ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు.

అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్‌ స్కూల్‌లో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్‌ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్‌ కాన్వాయ్‌ ట్రయల్‌ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్‌ కానున్నాయి. 

ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్‌ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top