కొలిక్కివచ్చిన ఎన్నికల సన్నాహాలు
ఉమ్మడి జిల్లాల వారీగా కలెక్టర్లతో ముగిసిన వీడియో కాన్ఫరెన్స్‌లు
సాధారణ, ఎన్నికల వ్యయ పరిశీలకులతో ఎన్నికల కమిషనర్ భేటీ
జిల్లాల్లో రిటర్నింగ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ముగిసిన శిక్షణ... ఈ నెల 27లోగా షెడ్యూలు విడుదలయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల ఎన్నికల సన్నాహాలు కొలిక్కి రావడంతో ఎన్నికల షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు అనువైన తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూలు వెలువడే అవకాశమున్నట్లు సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో బ్యాలెట్ విధానంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ వారీగా ఫొటో ఓటరు తుది జాబితాను ప్రదర్శించారు. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, వార్డులు, డివిజన్ల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సంబంధిత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ సమీక్ష జరిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారుల లభ్యత, టీ పోల్ యాప్‌లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్ వంటి అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష జరిగింది. తాజాగా శనివారం మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతోనూ ఎన్నికల కమిషనర్ భేటీ అయ్యారు.
క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ..
ఎన్నికల నిర్వహణకు సన్నాహాల్లో భాగంగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా కొలిక్కి వచ్చాయి. ఈ నెల 19న రాష్ట్ర స్థాయిలో 13 మంది మాస్టర్ ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా శిక్షణ పొందిన మరో 21 మంది ట్రైనర్లు క్షేత్ర స్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
తొలిసారిగా వంద శాతం వెబ్‌కాస్టింగ్...
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, డివిజన్ల సంఖ్య 2,996 కాగా, వాటి పరిధిలో 8,025 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు తొలిసారిగా వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లోనూ సీసీ కెమెరాలు బిగించాలని నిర్ణయించింది.
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు తొలిసారిగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించగా, తొలిసారిగా కౌంటింగ్ టేబుళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. బందోబస్తు ప్రణాళికను పోలీసు శాఖ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమరి్పంచింది. మేడారం జాతర పూర్తయిన తర్వాత పురపాలక సంఘాల్లో పోలీసు బలగాల మోహరింపు ప్రారంభం కానున్నది.


