గర్భిణి ప్రాణం తీసిన మూఢనమ్మకం! | pregnant woman ends life in karimnagar | Sakshi
Sakshi News home page

గర్భిణి ప్రాణం తీసిన మూఢనమ్మకం!

Jun 2 2025 7:52 AM | Updated on Jun 2 2025 7:52 AM

pregnant woman ends life in karimnagar

ఇంటి నిర్మాణ సమయంలో భార్య గర్భంతో ఉండకూడదని అబార్షన్‌ మాత్రలు మింగించిన భర్త  

ఆదిలాబాద్‌ టౌన్‌: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ రోజు ల్లోనూ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను వీడటం లేదు. నూతన ఇంటి నిర్మాణ సమయంలో భార్య కడుపుతో ఉండటం శుభసూచకం కాదని నమ్మిన ఓ భర్త.. గర్భిణి అయిన తన భార్యకు అబార్షన్‌ మాత్రలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆరు నెలల గర్భిణి మృతిచెందింది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన ప్రవళికకు మూడేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్‌తో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. 

ఇటీవల వారు నూతన ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చడం అరిష్టమని భావించిన భర్త ప్రవళికకు అబార్షన్‌ మాత్రలు మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ ఫణీందర్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement