
రాజాపూర్: పండుగపూట మహబూబ్ నగర్ జిల్లాలో ఓ విషాదం చోటు చేసుకుంది. పూరీ తింటుండగా గొంతులో ఇరుక్కుని ఒక యువకుడు మృతి చెందాడు. రాజాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన.
తిర్మలాపూర్ గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి దగ్గర ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి కుమార్ (25), బాండ్ర గిరయ్య పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తొలిఏకాదశి పండుగ కావడంతో ఆదివారం ఉదయం పొలం పనులు చేస్తున్న కుమార్, గిరయ్య తినడానికి.. రైతు రాంరెడ్డి పూరీలు తీసుకువచ్చాడు. ఇద్దరూ పూరీలు తింటుండగా.. కుమార్ గొంతులో ఇరుక్కుపోయింది. పక్కనే ఉన్న గిరయ్య నీళ్లు తెచ్చి తాగించేందుకు ప్రయత్నిస్తుండగానే.. కుమార్ కింద పడిపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో.. తల్లి రాజమణి, చెల్లెలు తమకు దిక్కెవరంటూ బోరున విలపించారు. కుమార్ మృతితో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.