కొలిక్కిరాని పాలిసెట్‌ | Polycet Confusion Continues in Telangana | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని పాలిసెట్‌

Jul 7 2025 3:39 AM | Updated on Jul 7 2025 3:39 AM

Polycet Confusion Continues in Telangana

కొనసాగుతున్న డేటా రికవరీ ప్రయత్నాలు

రికవరీ అయినా స్క్రీన్‌పై మాయమవుతున్న డేటా 

ఒక్కసారిగా అటాక్‌ చేసిన బగ్స్‌ 

పెన్‌ డ్రైవ్‌ పెట్టారా? డేటాను బదిలీ చేశారా? 

సమాచార సేకరణలో నిఘా వర్గాలు 

రంగంలోకి ఐటీ నిపుణులు.. మరో వారం దాకా సీట్ల కేటాయింపు కష్టమే

సాక్షి, హైదరాబాద్‌: పాలిసెట్‌ గందరగోళం ఇంకా కొనసాగుతోంది. వెబ్‌సైట్‌ నుంచి తుడిచిపెట్టుకుపోయిన డేటాను రికవరీ చేసేందుకు సాంకేతిక విద్యా విభాగం అష్టకష్టాలు పడుతోంది. ఏం జరుగుతోందనేది మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. సీట్ల కేటాయింపు ఇప్పట్లో ఉండే అవకాశం లేదని అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. 

వచ్చేవారం దీనిపై స్పష్టత రావచ్చని సంకేతాలిస్తున్నారు. ఈ గందరగోళంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకునేందుకు ఆదివారం కొంతమంది విద్యార్థులు పాలిసెట్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అనుమతి లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై వివరాలు సేకరిస్తోంది. 

నిఘా వర్గాలు కూడా అసలేం జరిగిందని వాకబు చేస్తున్నాయి. పాలిసెట్‌ తొలి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీన చేపట్టాల్సి ఉంది. ఈలోగా పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల డేటా మొత్తం ఎరైజ్‌ అయిన విషయం బయటకు పొక్కింది. దాదాపు 22 వేల మంది విద్యార్థులు పాలిటెక్నిక్‌ సీట్ల కోసం ఎదురుచూస్తున్నారు. 
 
పదేపదే ఎర్రర్స్‌ 
డేటా రికవరీ కోసం సాంకేతిక విద్యా విభాగం శనివారం రాత్రి నుంచి పరుగులు పెడుతోంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగులను కొన్నాళ్లు ఆఫీసుకు రావద్దని ఆదేశించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం ప్రత్యేక సాంకేతిక బృందాలను రంగంలోకి దించి సాఫ్ట్‌వేర్‌ పొరపాట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. 

డేటాను బ్యాకప్‌ ద్వారా రికవరీ చేసినప్పటికీ, ఆప్షన్ల విషయంలో సెకన్లలోనే డేటా స్క్రీన్‌ మీది నుంచి మాయమవుతున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టేటప్పుడు సర్వర్లు, హార్డ్‌ డిస్‌్కలను ఫార్మాట్‌ చేస్తారు. గుడ్‌ గవర్నెన్స్‌ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రాథమిక హార్డ్‌ డిస్‌్కల్లో కొన్ని రకాల బగ్స్‌ ఏర్పడినట్టు తెలిసింది. 

క్యాంపు కార్యాలయంలోని కంప్యూటర్స్‌లో ఎవరైనా వైరస్‌ ఉన్న పెన్‌ డ్రైవ్‌లు వాడితే ఇలాంటి బగ్స్‌ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. లేదా ఆప్షన్ల డేటాను నెట్‌వర్క్‌ ద్వారా ఇతరులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నా సమస్య రావచ్చని తెలిపారు. ఇలా చేయగలిగే అవకావం కేవలం క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికే ఉంటుందని చెబుతున్నారు. 

ఇది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అప్షన్లు తారుమారు చేసే ప్రయత్నాలు జరిగాయా? అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఇదంతా ఓ కొలిక్కి రావాలంటే మరికొన్ని రోజులు పట్టొచ్చని అంటున్నారు. సీట్ల కేటాయింపు వచ్చేవారం చేపడతామని అధికారులు తెలిపారు. దీన్ని బట్టి సమస్య తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. 

రంగంలోకి నిఘా వర్గాలు 
ప్రభుత్వ ఆదీనంలో ఉండాల్సిన డేటా రాత్రికి రాత్రే తుడిచి పెట్టుకుపోవడంతో ప్రభుత్వ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. దీనిపై ప్రభుత్వం నిఘా వర్గాల సమాచారం కోరినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్‌ వర్గాలు రాత్రి నుంచి సాంకేతిక విద్య వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నాయి. ప్రాథమిక సమాచారాన్ని ఆదివారం ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. 

మరోవైపు సీట్ల కేటాయింపు ఆలస్యం కావడం, దీనిపై సరైన వివరణ లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. పాలిసెట్‌ క్యాంపు కార్యాలయం ఉండే సాంకేతిక విద్యా విభాగానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు అవరసమని ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో సమీప పోలీసుస్టేషన్లతో పాటు, స్పెషల్‌ బ్రాంచీతో సమన్వయం చేసుకోవాలని అధికారిక ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.  

క్యాంపు అధికారులు ఏం చెబుతున్నారు? 
పాలిసెట్‌ ఫీజుల వ్యవహారమే సీట్ల కేటాయింపు ఆలస్యానికి కారణమని అధికారులు అంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల ఫీజులు పెరిగాయి. రూ.15 వేల నుంచి రూ.39 వేల వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.3,800 మాత్రమే ఫీజు వచ్చింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.15 వేలు ఇస్తుంది. 

కానీ, మిగిలిన రూ.24 వేలు విద్యార్థులు చెల్లించాలా? ప్రభుత్వమే రీయింబర్స్‌ చేస్తుందా? అనే విషయంలో స్పష్టత రాలేదని చెబుతున్నారు. దీనికోసమే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇదే నిజమైతే ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం తెలియదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement