పీసీసీలో ‘పీకే’ ఫీవర్‌! అలా అయితే ఎలా?

Political Strategist Prashant Kishor Tension In Telangana Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) టెన్షన్‌ పట్టుకుంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ఆయన.. కాంగ్రెస్‌ శిబిరం లోకి వస్తుండటం, మరోవైపు తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ పక్షాన పనిచేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం పీకేతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయన ప్రాంతీయ సమీకరణాల పేరుతో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తుకు దారితీయిస్తారేమోనన్న సందేహం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది.

దీనితో ఎవరూ అడగకున్నాకూడా.. టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండదంటూ పార్టీ పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో స్పష్టత ఇప్పిం చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాహుల్‌గాంధీతో స్పష్టత ఇప్పించి.. టీఆర్‌ఎస్‌తో పొత్తు చర్చకు తెరదింపాలని భావిస్తున్నట్టు సమాచారం. 

లోక్‌సభ నాటికి ఎలా? 
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. అదేబాటలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పక్షాన కూడా ఆయన టీం పనిచేస్తోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితిపై పీకే టీం అధ్యయనం చేసి.. టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి నివేదిక కూడా ఇచ్చినట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని నేరుగా ధ్రువీకరించకపోయినా.. పీకేతో కలిసి పనిచేస్తే తప్పేమిటని విలేకరుల సమావేశంలోనే పేర్కొనడం గమనార్హం. ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని పీకే సిద్ధం చేస్తారని.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఆయనకు తెలుసు గనుక కలిసి పోటీ చేయాలని సూచిస్తారేమోననే కాంగ్రెస్‌ నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీస్తుందని, అందువల్ల వరంగల్‌ సభ వేదికగా రాహుల్‌తో స్పష్టత ఇప్పించాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు.

రాహుల్‌తో చెప్పించేందుకు! 
తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా రాష్ట్రంలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైందని.. 2014 ఎన్నికల్లో అతివిశ్వాసం దీనికి కారణంకాగా, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కొంప ముంచిందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవాలని.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి మరీ ఎన్నికల గోదాలోకి దిగాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేస్తున్నామన్న సంకేతాలూ ఇస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామంపై స్పందిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం తామేనని, ప్రజల పక్షాన పోరాడేది తామేనన్న భావనను కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ తెరపైకి రావడం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో కలవరం రేపుతోంది. ఇటీవల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన టీపీసీసీ కీలక నేత ఒకరు ప్రత్యేకం గా పీకే, టీఆర్‌ఎస్‌తో పొత్తు అంశాలను ప్రస్తావించారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ దగ్గరే తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే తాము టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధంగా లేమని బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల రాహుల్‌తో టీపీసీసీ నేతలు భేటీ అయిన సందర్భంలో.. ఏ పార్టీతో పొత్తు ఉండదని, టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై పోరాటాన్ని కొనసాగించాలని రాహుల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కానీ అప్పటికి రాష్ట్ర ఎన్నికల వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు మాత్రమే ఉన్నారు. పీకే తెరపైకి రాలేదు. ఇప్పు డు పీకే కాంగ్రెస్‌ శిబిరంలోకి వస్తుండటంతో టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రచారం ఊపందుకుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top