రిజర్వేషన్ల చుట్టూ ‘రాజకీయం’ | Political parties in Telangana are targeting local body elections | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల చుట్టూ ‘రాజకీయం’

Jul 14 2025 1:00 AM | Updated on Jul 14 2025 1:00 AM

Political parties in Telangana are targeting local body elections

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలోని రాజకీయ పక్షాల ఎత్తులు

బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పుకునే ప్రయత్నంలో అధికార కాంగ్రెస్‌ 

అసెంబ్లీలో బిల్లు మొదలు ఆర్డినెన్స్‌ వరకు రిజర్వేషన్ల అంశాన్ని ఉపయోగించుకునే వ్యూహం 

రాష్ట్రపతి వద్ద బిల్లు ఆమోదానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేంటని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు 

అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీస్తున్న వైనం

బలహీన వర్గాలను మోసం చేసే ఎత్తుగడే అంటున్న బీఆర్‌ఎస్‌.. చట్టబద్ధత కావాలని డిమాండ్‌ 

రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్‌ తేవడం బీసీలను ఏమార్చడానికేనంటున్న బీజేపీ 

ఆర్డినెన్స్‌ ఆధారంగా జీవో ఇస్తే.. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయేమోననే ఆందోళనలో బీసీలు  

ఎవరికి వారే పైచేయి సాధించేందుకు కౌంటర్లు, ఎన్‌కౌంటర్లతో మొదలైన స్థానిక ఎన్నికల వేడి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలన్నీ బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. స్థానిక సంస్థలకు మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఊపందుకున్న రిజర్వేషన్ల రగడను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో అధికార కాంగ్రెస్‌ ఓ అడుగు ముందుండగా.. బీఆర్‌ఎస్, బీజేపీ కూడా బీసీల మన్ననలు పొందేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నాయి. 

అయితే, పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఈసారి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుకాకుండా ఎక్కడ ఆగిపోతాయేమోననే ఆందోళన బీసీ సంఘాలు, ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశంలో రాజకీయ కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు, కోర్టు కేసు వ్యవహారంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో అసలు ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియకుండానే రాష్ట్రంలో ‘స్థానిక’వేడి మొదలుకావడం గమనార్హం. 

అధికార పార్టీ ఏమనుకుంటోందంటే.. 
ఎవరెంతో.. వారికంత అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అందిపుచ్చుకున్న దేశవ్యాప్త నినాదంతో సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఎస్సీల వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణతోపాటు తాజాగా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌తో అన్ని వర్గాలకు తాము న్యాయం చేస్తున్నామని చెబుతోంది. అంతకంటే ముందు అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు కూడా కామారెడ్డి డిక్లరేషన్‌ను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామనేందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలంటున్నారు. 

తాము మాత్రమే బీసీలకు న్యాయం చేయగలమని, అందుకే చేశామని ఆ పార్టీ నేతలంటుండగా సీఎం రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి రాహుల్‌గాంధీ ప్రధాని అయి ఉంటే 48 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయించేవాడినన్నారు. కేబినెట్‌ ఆర్డినెన్స్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహించి తామే బీసీల చాంపియన్‌నని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు ఢిల్లీ యాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

అయితే, ఈ పార్టీ వర్గాల్లో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ ఆగం చేస్తుందా అనే మీమాంస కూడా కనిపిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లు రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు ఆర్డినెన్స్‌ తీసుకురావడం ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై ఆ పార్టీ నేతల్లోనూ సందేహాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. 
 
విపక్షాలు ఏమనుకుంటున్నాయంటే... 
కర్ర విరగకుండా పాము చావకుండా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్న పార్టీగా చేయాల్సింది చేయకుండా బీసీ వర్గాలను బుట్టలో వేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినప్పుడే చెప్పారని, అయితే ఇప్పటివరకు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీస్తున్నాయి. 

అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చిన ఆయన కనీసం ఒక్కసారి కూడా ఎందుకు బీసీ బిల్లు ఆమోదం గురించి వినతిపత్రం ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రపతి వద్దకు వెళ్లిన బిల్లును ఆమోదింపజేసి పార్లమెంటు ఆమోదం కోసం తీసుకురావడంలో కాంగ్రెస్‌ చేసిన కృషి ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ను వినిపిస్తున్న బీఆర్‌ఎస్‌ ఈ విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని తప్పుపడుతోంది. బీసీలను మోసం చేసేందుకే ఆర్డినెన్స్‌ అంటున్నారని, ఏకసభ్య కమిషన్‌ పేరుతో ఇచ్చిన నివేదిక లొసుగులతో ఉందని, ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి లేదని అంటోంది. ఇక, బీజేపీ కూడా ఈ విషయంలో కాంగ్రెస్‌ వైఖరిని తప్పుపడుతోంది. 

రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా, ఆర్డినెన్స్‌ తేవడం బీసీలను ఏమార్చడానికేనని అంటోంది. తాము బహిరంగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతిస్తున్నా.. అటు రాష్ట్రపతితోపాటు ఇటు పార్లమెంటులోనూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం పొందకపోతే తమకు ‘స్థానిక’ంగా పట్టురాదేమోననే ఆందోళన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. 

బీసీ సంఘాలు ఏమంటున్నాయి... 
ఆర్డినెన్స్‌ ఆధారంగా ప్రభుత్వం జారీ చేయాలనుకుంటున్న రిజర్వేషన్ల జీవోకు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై బీసీ సంఘాల్లో, ఆయా వర్గాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవో కోర్టులో నిలబడుతుందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టులో సవాల్‌ చేస్తే నిలబడదని కొందరు, కొన్ని ప్రాతిపదికల మీద నిలబడుతుందని మరికొందరు అంటున్నారు. 

గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విధంగా రిజర్వేషన్ల సీలింగ్‌ 50 శాతానికి పరిమితం అవుతుందని, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన కల్పించే రిజర్వేషన్లు పోను 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయడం సుప్రీంతీర్పు అమల్లో ఉన్నంతవరకు సాధ్యం కాదని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోను సవాల్‌ చేస్తే వెంటనే కోర్టు కొట్టి వేస్తుందనేది వారి వాదన. 

అయితే, గతంలో బీసీల జనాభా లెక్కలు అందుబాటులో లేనందున కోర్టులు కొట్టివేశాయని, ఇప్పుడు ప్రభుత్వం చేసిన కుల సర్వేలో బీసీల జనాభా 56 శాతంగా తేలిందని, బీసీలకు తగినంత రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులోనే పేర్కొన్నందున 42 శాతం కోటా న్యాయ సమీక్షలో నిలబడుతుందని మరికొందరు వాదిస్తున్నారు. 

అలాగే, డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు అంశం కూడా ఈ వాదనకు బలాన్నిస్తుందని అంటున్నారు. మరోవైపు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేసే క్రమంలోనే 50 శాతం సీలింగ్‌ చాలా రాష్ట్రాల్లో దాటిపోయిందని, తెలంగాణలోనూ ఇబ్బంది ఉండదని వారంటున్నారు. 

మరోవైపు బీసీ వర్గాలకు న్యాయం జరుగుతున్నందున దాన్ని అడ్డుకోవద్దని, కోర్టులో కేసులు వేయొద్దని అటు రాజకీయ పార్టీలకు, ఇటు ప్రజలకు బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా ఏ క్షణంలో కోర్టులో కేసు పడుతుందోననే గుబులు మాత్రం కనిపిస్తోంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టు కూడా జోక్యం చేసుకోదనే వాదన సముచితం కాదనే భిన్నమైన అంశాన్ని బీసీ సంఘాల నిపుణులు తెరపైకి తెచ్చారు. 

గతంలో మహారాష్ట్రలో ఇదే జరిగిందని, మరాఠాలను బీసీల్లో చేర్చి, వారికి రిజర్వేషన్లు కల్పించి పంచాయతీ ఎన్నికలకు వెళ్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మరీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జీవోలు, ఆర్డినెన్స్‌ల కంటే పార్లమెంటు ఆమోదం ద్వారా 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడమే రక్షణ కవచమని, ఆ కోణంలోనే అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement