
పటాన్‌చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు.
అనిత, సంజీవ్‌లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది.