గోవాను షెల్టర్‌గా ఎంచుకున్నపలువురు బుకీలు
వారిని అడ్డం పెట్టుకొని దందా చేస్తున్న పోలీసులు
‘పట్టు–విడుపుల’మధ్య సాగుతున్న బేరసారాలు
రాజధానిలోని విభాగాలకు ఐడీలతో కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ దందా కొందరు ఖాకీలకు కాసులు కురిపిస్తోంది. బుకీలు (పందేలు అంగీకరించేవారు) తమ డెన్‌లను మార్చుకోవడాన్నీ పోలీసులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గోవా కేంద్రంగా అనేక రహస్య ఆపరేషన్లు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అక్కడ పట్టుకొని రాష్ట్ర/నగర సరిహద్దుల్లో వదిలేసే మధ్యలోనే బేరసారాలన్నీ పూర్తయిపోతున్నాయి. ఈ వ్యవహారాల కోసం కొందరు ఎస్పీలు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రాజధానిలోని కొన్ని విభాగాలకు పంటర్ల ఫోన్లలో ఉండే ఐడీలు కాసులు కురిపిస్తున్నాయి. ఖాకీల చేతిలో ‘దెబ్బతిన్న’బుకీలు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవడంతో ఈ వ్యవహారాలు బయటకు పొక్కట్లేదు.
దేశంతో సంబంధం లేకుండా దందా
మొదట్లో భారత్ జట్టు పాల్గొనే మ్యాచ్‌లకే పంటర్లు (పందెం కాసేవారు) ఉండేవారు. భారత్–పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇవి జోరుగా సాగేవి. ఆ తర్వాతి కాలంలో భారత్ జట్టు ఆడుతున్నా, లేకున్నా దాయాది దేశంతోపాటు కొన్ని కీలక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు బెట్టింగ్ పెట్టడం మొదలైంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ మ్యాచ్ జరుగుతున్నా బుకీల బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. ఇంటర్‌నెట్, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచి్చన తర్వాత ఇంగ్లండ్‌లో జరిగే లీగ్ మ్యాచ్‌లకు ఇక్కడ బెట్టింగ్ నడుస్తోంది.
స్థానికంగా అనేక ఇబ్బందులు వస్తుండటంతో...
ఒకప్పుడు ఈ బెట్టింగ్స్ అంగీకరించే బుకీలు ఆయా నగరాలు, పట్టణాల్లో ఉండి దందా చేసేవారు. పందెం రాయుళ్లు, పందేల వివరాలను నమోదు చేసుకోవడానికి, స్లిప్స్ జారీ చేయడానికి, నగదు లావాదేవీల కోసం వారు అందుబాటులో ఉండటం అనివార్యమయ్యేది. దీంతో ప్రతి ప్రాంతంలో ఉండే బుకీలు, వారి వద్ద పనిచేసే కలెక్షన్ ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు స్థానిక పోలీసులకు తెలిసేవి. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంతో బుకీలు ప్రస్తుతం తమ పంథాను పూర్తిగా మార్చేశారు. ఉత్తరాదిలోని కొన్ని నగరాలను అడ్డాగా చేసుకొని పనిచేస్తున్నారు.
ప్రధానంగా గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఈ బుకీల డెన్లు ఉంటున్నాయి. పందెం కాయడం నుంచి నగదు ఇచ్చిపుచ్చుకోవడం వరకు అంతా ఆన్‌లైన్ అయిపోవడంతో వీరి పని మరింత తేలికైంది. బుకీల పం«థా మారినట్టే పోలీసులు, ప్రత్యేక బృందాలు, విభాగాలు సైతం తమ పంథా మార్చుకున్నాయి. ఊహకి అందని విధంగా విరుచుకుపడుతూ వసూళ్లకు పాల్పడుతున్నాయి.
అక్కడే నిర్బంధించి...తీసుకొస్తూ మార్గ మధ్యలో...
స్థానికంగా ఉన్న మాజీ బుకీలు, తమ వేగుల ద్వారా ఉత్తరాది, గోవాలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న బుకీల వివరాలు తెలుసుకుంటున్నారు. రహస్య ఆపరేషన్ల పేరుతో అక్కడకు వెళుతున్న బృందాలు ఆయా బుకీలను అదుపులోకి తీసుకుంటున్నాయి. వీలుంటే అక్కడే నిర్బంధించి, లేదంటే ఇక్కడకు తరలిస్తూ వారి సంబం«దీకులు, అనుచరులతో బేరసారాలు చేస్తున్నాయి. అలా వీలైనంత వసూలు చేసుకొని ఆ బుకీలను విడిచిపెడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లలో ఉన్న ప్రత్యేక విభాగాలు ఈ వ్యవహారాల్లో బిజీగా ఉంటున్నాయి.
మరో అడుగు ముందుకేసిన ఓ ఎస్పీ ఏకంగా ఈ వసూళ్ల కోసమే ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని వినికిడి. గోవా–ఔటర్ రింగ్ రోడ్డు మధ్య అదుపులోకి తీసుకోవడాలు, బుకీల సంబం«దీకుల్ని బెదిరించి దొరికినంత వసూలు చేసి వదిలి పెట్టడం జరిగిపోతున్నాయి. ఆ బుకీలు ఇచి్చన సమాచారంతో ఇక్కడ ఉన్న వారి అనుచరులను బెదిరిస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఐడీల కోసం ప్రత్యేకంగా వేగులు
ఆన్‌లైన్ బెట్టింగ్ నిషేధం తర్వాత పోలీసులు కొత్త దందా ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్ల ద్వారా పందేలు కాయాలంటే పంటర్లకు రిజి్రస్టేషన్, ప్రత్యేక ఐడీలు ఉండాలి. ఇవి ఎవరి ఫోన్లలో ఉన్నా యో తెలుసుకుంటున్న పోలీసులు, ప్రత్యేక విభాగాలు ఆ వివరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ ఐడీలు ఎవరెవరి ఫోన్లలో ఉన్నాయో గుర్తించడానికి ప్రత్యేకంగా వేగుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని వర్గాలకు చెందిన యువతను ఆకర్షించడంతోపాటు ఒకసారి ఐడీ తో చిక్కి, తమ ‘డిమాండ్లు’నెరవేర్చిన వారిని ఇలా వేగు లుగా మార్చుకుంటున్నారు. వీరిచ్చే సమాచారంతో ఫో న్‌లో ఐడీ ఉన్న వారిని అదుపులోకి తీసుకోవడం... అరె స్టు, కేసు పేరుతో బెదిరించి దండుకోవడం ఇటీవల పెద్ద దందాగా మారిపోయింది. అత్యున్నతాధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి పెడితేనే కిందిస్థాయి అధికారులు, ఉన్నతాధికారులకు చెక్ పడే అవకాశం ఉంటుంది.


