గూడు చెదిరి.. గుండె పగిలి..

Police Constable Request To Take Up Spouse Transfers - Sakshi

ఖమ్మం: శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో.. దుండగుల బారి నుంచి సమాజాన్ని కాపాడటంలో పోలీసులదే కీలక పాత్ర. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అనుక్షణం ప్రజారక్షణ కోసం పరి తపిస్తూ.. ఓ వైపు లా అండ్‌ ఆర్డర్‌.. మరోవైపు కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో దంపతులిద్దరూ కూడా సేవలందించేవారున్నారు. అలాంటి వారికి పెద్ద కష్టమే వచ్చింది. ఉద్యోగం ఉందన్న ఓ ఆశ తప్పితే వారి జీవితంలో సుఖసంతోషాలు కరువై నరకయాతన అనుభవిస్తున్నారు. భర్త ఒకచోట.. భార్య మరోచోట.. వారి పిల్లలు ఇంకోచోట.. ఇలా గూడు చెదిరిన పక్షుల వలె స్పౌజ్‌ పరిధిలోని కానిస్టేబుళ్లు కన్నీళ్లను దిగమింగుకుని విధులకు హాజరవుతున్నారు. కుటుంబం, విధులు అనే రెండింటి మధ్య తల్లడిల్లుతూ ఆగమ్యగోచరంగా మారిన తమ తలరాత ఎప్పుడు మారుతుందోనంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు.  

317 జీఓతో చెల్లాచెదురు 
తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త జోనల్‌ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా 2021లో తీసుకొచ్చిన 317 జీఓ పోలీస్‌ శాఖలో ఒకే జిల్లాలో పనిచేసుకుంటున్న దంపతులకు శాపంగా మారిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేశారు. దీంతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న దంపతులు చెరో జిల్లాలకు బదిలీ అయ్యారు. సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేయడంతో భార్య ఒకచోట, భర్త మరోచోట విధులు నిర్వర్తిస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి ఆలనా, పాలన, చదువు, ఇలా ప్రతిదీ కష్టంగా మారడంతో స్పౌజ్‌ కానిస్టేబుళ్లు తమ సమస్యను పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు వేడుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలంటే ఆ బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

దంపతులిద్దరూ పోలీసులే.. కానీ..  
ఉద్యోగమున్నా అటు పిల్లలను చూసుకోలేక, ఇటు కుటుంబాన్ని పట్టించుకోక దంపతులిద్దరూ బాధను దిగమింగుకుంటూ విధులకు హాజరవుతున్నారు. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్నా సంతోషం కరువైందని, కుటుంబం దగ్గరగా లేకపోవడంతో స్పౌజ్‌ కానిస్టేబుళ్లు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ ఉన్నా కనీసం కుటుంబ సభ్యులతో సరదాగా కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం కరుణ చూపి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్పౌజ్‌ పరిధిలోని పోలీసులు మొరపెట్టుకుంటున్నారు. పిల్లల భవిష్యత్‌ను అర్థం చేసుకుని తమకొక దారిచూపాలని కోరుతున్నారు. 

ఉపాధ్యాయుల మాదిరి కరుణ చూపండి.. 
క్రమబదీ్ధకరణ సమయంలో ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్‌ లిస్టులో ఉంచి దంపతులైన ఉద్యోగుల బదిలీలను నిలిపివేసింది. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. గత నెల 26న విద్యాశాఖ 13 జిల్లాల్లోని దంపతులైన ఉపాధ్యాయులను (స్పౌజ్‌) ఒకే జిల్లాకు బదిలీ చేసింది. అయితే ఎస్జీటీల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న స్పౌజ్‌ పరిధిలోని ఉద్యోగులను కూడా బదిలీ చేయాలని పోలీసులు ప్రభుత్వానికి, డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో స్పౌజ్‌ కింద పనిచేసే వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 150 మంది ఉంటారు. బదిలీ అవకాశం కల్పించమని దరఖాస్తు చేసుకొని సంవత్సరం దాటినప్పటికీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.

ఇబ్బంది ఉందని సిక్‌ లీవ్, ఎర్న్‌ లీవ్స్‌ అడిగినప్పటికీ బందోబస్తు ఉన్నాయని కొన్ని ప్రాంతాల్లో సెలవులకు కూడా అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది. అసలే సెలవులు లేని ఉద్యోగం, పిల్లలను చూసుకునేందుకు ఒక పూట అనుమతి తీసుకుని ఇంటికి బయలు దేరినా మార్గమధ్యలో ఎమర్జెన్సీ డ్యూటీ అని ఫోన్‌ వస్తే కుటుంబాన్ని చూడకుండానే వెనుదిరిగే పరిస్థితి ఉందని పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు మినహా మిగతా ఉద్యోగులకు తమకేమైనా సమస్య వస్తే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతారు. కానీ పోలీసులకు అలాంటి పరిస్థితి ఉండదు. యూనిఫాం వేసుకున్న రోజే వారు ఆ హక్కును కోల్పోతారు. ప్రభుత్వం తమ దీనగాథను అర్థం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని స్పౌజ్‌ పరిధిలోని పోలీసులు కోరుతున్నారు.  

ఖమ్మం జిల్లాలో భార్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండగా, భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నాడు. వారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇటీవల రెండు సంవత్సరాలు వయసు కలిగిన చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకొని వెళ్లాల్సి వచి్చంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు విధి నిర్వహణలో ఉండడం, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్‌ చేసి చెప్పగా వారు ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. నాలుగైదు గంటల తర్వాత వారు ఆసుపత్రికి వెళ్లాల్సి వచి్చంది. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారిని ఆసుపత్రిలో చేరి్పంచలేక, మరోవైపు విధులను వదిలేసి రాలేక వారు నరకయాతన అనుభవించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top