
ఈడీ పేరుతో రూ.4.79 కోట్లు దోపిడీ
బెంగళూరులో వృద్ధులకు టోకరా వేసిన కేటుగాళ్లు.. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్‌కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది.
మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్‌ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు.
ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు.
ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్‌కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు.
వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు.