
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్సైబీ) ఓఎస్డీ ప్రభాకర్‌రావు దాదాపు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాకర్ రావు బౌన్సర్లు హంగామా చేశారు. విమానాశ్రయంలో ప్రభాకర్ రావుకు రక్షణ కవచంగా బౌన్సర్లు రక్షణ కవచంగా నిలబడ్డారు. ఈ సందర్బంగా ప్రభాకర్ రావును మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు దాడి చేశారు. కొంతమంది యూనిఫాంలో ధరించి.. మరి కొంత మంది సివిల్ డ్రెస్‌లో ఉన్న బౌన్సర్లు ఓవరాక్షన్‌కు దిగారు. ప్రభాకర్ రావు సైతం మీడియాకు ముఖం చాటేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Em Ganakaryam chesinav Ani siggupaduthunav Prabhakar Rao! Khaaki Paruvu Theesindi Kaakunda!🗣️ pic.twitter.com/VMpKSj2OWn
— Rishi Karan Reddy (@Rishi_Karan_) June 8, 2025
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా ప్రభాకార్ రావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిగతా నిందితులైన పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులు అరెస్టయి దీర్ఘకాలం రిమాండులో ఉండి బెయిల్ పొందారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీరందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్న ప్రభాకర్‌రావు.. ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్‌పోర్టు రద్దు చేయించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రావడంతో విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
గత ప్రభుత్వంలో ఎవరు చెబితే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ, సినీ ప్రముఖులు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆర్థికసాయం చేసినవారి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు బయటకు వచ్చింది. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.