పుచ్చిపోతున్నా పట్టించుకోరేం?

Peas Provided By Center In Lockdown Are Infested With Insects - Sakshi

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీపై చిన్నచూపు

కేంద్రం ఇచ్చిన ‘ఉచిత శనగలు’ పురుగుల పాలు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్‌లో కేంద్రం అందించిన ‘శనగలు’ పురుగుల పాలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకంపై నిర్లక్ష్యమో లేక నిబంధన మేరకు ఉచిత పంపిణీ సాధ్యం కాకపోవడమో తెలియదు గాని ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ గోదాములు, ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో శనగల నిల్వలు మాత్రం సగానికిపైగా పురుగులు పట్టాయి. లాక్‌డౌన్‌లో ఉపాధితో పాటు తిండిగింజలు లభించక తల్లడిల్లుతున్న వలస కార్మికుల కోసం ఆహార ధాన్యాలతో పాటు సరఫరా చేసిన శనగల పంపిణీ కనీసం మూడు శాతానికి మించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చదవండి: అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?

ఇదీ పరిస్థితి.. 
కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో భాగంగా వలస కార్మికులకు రెండు నెలల పాటు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు, కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు కోటా విడుదల చేసింది. సొంత ప్రాంతంలో గాని ఆయా రాష్ట్రాల్లో గాని రేషన్‌ కార్డ్‌ లేని వారిని మాత్రమే ఈ ఆహార పదార్థాలను తీసుకునేందుకు అర్హులుగా పేర్కొంది.  చదవండి: వేరుశనగ రైతులను ఆదుకోవాలి

► మే, జూన్‌ నెలలకు కలిపి రాష్ట్రానికి 1066 టన్నుల శనగలు కేటాయించి సరఫరా చేసింది. కానీ వలస కార్మికులు అందుబాటులో లేకపోవడంతో శనగల ఉచిత పంపిణీ మాత్రం 34 టన్నులకు మించనట్లు  పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
► కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు  చేరేనాటికి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉపాధి కరువై స్వస్థలాల బాట పట్టి వెళ్లిపోవడం ఉచిత శనగల పంపిణీకి సమస్యగా తయారైంది. 
► ఇక వలస కార్మికులు అధికంగా ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లాకు 14,791 కిలోల శనగలు కేటాయించగా  కేవలం పాతబస్తీలో యాకుత్‌పురా సర్కిల్‌లోని వలస కార్మికులకు 274 కిలోలు,   కార్డుదారులకు 548 కిలోల శనగలు మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు.  

నగరం నుంచే 15 లక్షల మంది వలస కార్మికులు 
లాక్‌డౌన్‌ సమయంలో కేవలం హైదరాబాద్‌ నుంచే సుమారు 15 లక్షల మందికిపైగా వలస కార్మికులు వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు వెళ్లిపోయారు. మొత్తం మీద ఉపాధి కోసం వలస వచ్చిన సుమారు 90 శాతానికిపైగా వలస కార్మికులు వెళ్లిపోగా కేవలం 10 శాతం మంది మాత్రం ఇక్కడే ఉండిపోయారు. వీరిని గుర్తించి ఉచిత శనగలను పంపిణీ చేయడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఉచిత శనగల  పంపిణీ చేయలేకపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి చేతులు  దులుపుకొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథక గడువు పొడిగించి జూలై నుంచి నవంబర్‌ వరకు ఐదు నెలల పాటు ఉచితంగా శనగల పంపిణీ కోసం కేటాయింపులు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శనగల స్థానంలో కంది పప్పు కేటాయించి విడుదల చేయాలని ప్రతిపాదించింది.  

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద  లబ్ధిదారు కుటుంబాలన్నింటికీ  నెలకు ఒక కేజీ వంతున ఆత్యధిక ప్రొటీన్లు అందించే శనగలు పంపిణీకే కేంద్రం మొగ్గు చూపి రాష్ట్ర ప్రతిపాదనలు పక్కకు పెట్టడంతో పాటు శనగల కోటాను విడుదలను నిలిపివేసింది. స్వస్థలాల నుంచి వలస కార్మికులు ఉపాధి కోసం తిరిగి వెనక్కి వస్తున్నా.. ఉచిత శనగల పంపిణీ మాత్రం ఊసే లేకుండాపోయింది.  సంబంధిత శాఖ మంత్రి హామీ సైతం  అమలుకు నోచుకోలేదు.  

ప్రణాళిక లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
కరోనా లాక్‌డౌన్‌కష్టకాలంలో వలస కార్మికులకు ఉచిత శనగల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రణాళిక లేకుండాపోయింది. వలస కార్మికుల కచ్చితమైన వివరాలు ఇరు ప్రభుత్వాల వద్ద లేకపోవడతోనే ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ ఫలాలు లబ్ధిదారులకు అందలేకపోయాయి. ఒకవైపు కేంద్రం శనగల కోటా సకాలంలో అందించలేక పోవడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంపిణీకి చర్యలు చేపట్టలేదు.  ఫలితంగా శనగలు పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు.   
– డేవిడ్‌ సుధాకర్, సామాజిక కార్యకర్త్త, హైదారాబాద్‌ 

డిస్పోజల్‌ ఆర్డర్‌ కోసం రాశాం
కేంద్రం వలస కార్మికుల కోసం అందించిన శనగల కోటాను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేక పోయాం. కేంద్రం నుంచి శనగలు వచ్చే నాటికి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లి పోయారు. జిల్లాల వారీగా కేటాయించి సరఫరా చేసినా స్వల్పంగా మాత్రమే పంపిణీ చేయగలిగాం. ప్రస్తుతం నిల్వలున్న శనగలు పురుగులు పట్టాయని మా దృష్టికి వచ్చింది. వాటిని డిస్పోజల్‌ చేసేందుకు కేంద్రానికి లేఖ రాశాం. ఆర్డర్‌ కోసం ఎదురు చూస్తున్నాం.  
– డీడీ, పౌరసరఫరాల శాఖ, హైదరాబాద్‌. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top