అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ?

Telangana High Court Question To Government About LRS - Sakshi

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టు వ్యాఖ్య

కౌంటర్‌ దాఖలు చేయండి.. 12వ తేదీకి విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం అక్రమ లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం తెచ్చిన జీవో–131.. అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉందంటూ హైకోర్టు మండిపడింది. చట్టాలను ఉల్లంఘించిన వారికి మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడమేంటని ప్రశ్నించింది. అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం గత ఆగస్టులో ప్రభుత్వం తెచ్చిన జీవో–131ని సవాల్‌ చేస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరఫున పద్మనాభరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. జీవో 131 చట్టవిరుద్ధమని, జీవో జారీ చేసి మరీ క్రమబద్ధీకరించడం నిబంధనలకు విరుద్ధమని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు.

ప్రతి ఐదేళ్లకోకసారి అక్రమ నిర్మాణాలను, లేఔట్లను క్రమబద్ధీకరించడం సంప్రదాయంగా మారుతోందని పేర్కొన్నారు. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను, లేఔట్ల క్రమబద్ధీకరణతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. జీవో 111కు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టడం వల్లే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేస్తుందని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించగా, వారం రోజుల్లో వేస్తామని నివేదించారు. దీంతో 11లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top