33 జ్యుడీషియల్‌ జిల్లాలకు ఓకే 

PDJ Courts Open In Telangana Districts On June 2 - Sakshi

కొత్త జిల్లాల్లో జూన్‌ 2న పీడీజే కోర్టుల ప్రారంభం   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ జిల్లాలు ఏర్పడిన దాదాపు మూడేళ్ల తర్వాత 33 జ్యుడీషియల్‌ జిల్లాలకు సర్కారు ఆమోదం తెలిపింది. దీంతో నూతన జిల్లాల్లో ప్రధాన జిల్లా న్యాయస్థానాల(పీడీజే కోర్టు)ను ఏర్పాటు చేయనుంది. హైకోర్టు సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కోర్టులు పనిచేస్తున్నాయి.

జూన్‌ 2 నుంచి 33 జ్యుడీషియల్‌ జిల్లాల వారీగా పీడీజే కోర్టులు విధులు నిర్వహిస్తాయని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుగుణ గెజిట్‌ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలవారీగా ఉన్న కేసులను కొత్త జిల్లాలవారీగా విభజించి ఆయా కోర్టులకు బదిలీ ప్రక్రియను హైకోర్టు ఆమోదం తర్వాతే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కేసుల వివరాల హార్డ్‌ కాపీని, మెయిల్‌ ద్వారా ఈ నెల 24వ తేదీలోగా హైకోర్టుకు పంపించాలని జిల్లా కోర్టులతోపాటు ఇతర న్యాయస్థానాలకు సూచించారు.

కాగా, కొత్త జ్యుడీషియల్‌ జిల్లాల వారీగా కోర్టుల ఏర్పాటు నేపథ్యంలో భవనాలు, సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే భవనాలు ఎంపిక చేసినట్లు సమాచారం. రాష్ట్ర న్యాయశాఖలో కొత్త పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో కక్షిదారులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top