అంచనాకొచ్చారు... ఆలోచన మార్చారు | Options changing rapidly after allocation of mock seats in engineering counseling | Sakshi
Sakshi News home page

అంచనాకొచ్చారు... ఆలోచన మార్చారు

Jul 7 2026 2:29 AM | Updated on Jul 7 2026 2:29 AM

Options changing rapidly after allocation of mock seats in engineering counseling

వేగంగా కదులుతున్న ఆప్షన్లు 

మాక్‌ కౌన్సెలింగ్‌ తర్వాత మారుతున్న సీన్‌ 

సీటొచ్చే కాలేజీలపై కచ్చితంగా గురి 

ఒక్క రోజులోనే లక్షల్లో ఆప్షన్ల మార్పు 

10న తొలి విడత సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో మాక్‌ సీట్ల కేటాయింపు తర్వాత వేగంగా ఆప్షన్లు మారుతున్నాయి. ఒక్క రోజులోనే 36 లక్షలకుపైగా ఆప్షన్లను విద్యార్థులు మార్చుకున్నారు. మార్పులు, చేర్పులకు మంగళవారం వరకూ గడువు ఉంది. ఇది ముగిసే నాటికి ఆప్షన్ల మార్పు మరో పది లక్షలు పెరిగే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు ఆప్షన్లు పెంచుతున్నారు. ఇంకొంతమంది తీసివేస్తున్నారు. ప్రధానంగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, అనుబంధ ఎమర్జింగ్‌ బ్రాంచీల్లోనూ ఈ తేడా కన్పిస్తోంది. సివిల్, మెకానికల్, ఈఈఈ విద్యార్థుల్లో వేగం నిలకడగానే ఉంది. ఇవే బ్రాంచీలు కావాలని ఎంపిక చేసుకున్న విద్యార్థులు మార్పులకు ఇష్టపడటం లేదు. మెరుగైన కాలేజీ వైపే వాళ్లు చూస్తున్నారు.  తొలి దశ కౌన్సెలింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా 89,785 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తంగా 55,14,891 ఆప్షన్లు అందాయి. సాంకేతిక విద్యామండలి ఈ నెల 4న మాక్‌ సీట్ల కేటాయింపు వెల్లడించింది. 

175 కాలేజీల్లో 88,053 సీట్లు అందుబాటులో ఉంటే, 79,313 సీట్లను మాక్‌ ద్వారా కేటాయించారు. ఇంకా 8740 సీట్లు మిగిలిపోయాయి. అయితే ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులకే ఆప్షన్లు ఇచ్చారు. సీఎస్‌ఈ అనుబంధ ఎమర్జింగ్‌ కోర్సుల్లో 62,509 సీట్లు ఉంటే, 58,052 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో 4,457 సీట్లు మిగిలిపోయాయి. ఇప్పుడీ సీట్లు ఎక్కడ మిగిలిపోయే అవకాశం ఉందనే దానిపై ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు దృష్టి పెట్టారు. తమకన్నా పెద్ద ర్యాంకు వచ్చినా మంచి కాలేజీలో సీటు కోల్పోయిన విద్యార్థులు కాలేజీలు, బ్రాంచీల ఆప్షన్లు మార్చుకుంటున్నారు. ఇదే క్రమంలో 50 వేలపైన ర్యాంకు వచ్చినా అవగాహన లేకుండా 5 వేల లోపు కటాఫ్‌ ఉన్న కాలేజీలకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇష్టం లేని బ్రాంచీల్లో సాధారణ కాలేజీల్లో సీట్లు వచ్చాయి. మాక్‌ తర్వాత వాళ్లు కూడా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఆప్షన్లు మార్చుకుంటున్నారు.  

కాలేజీనా? బ్రాంచ్‌నా? 
మాక్‌ సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు పలు అంశాలపై అధ్యయనం మొదలు పెట్టారు. నిపుణులు, అధ్యాపకులు, కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వెబ్‌సైట్‌ ద్వారా శోధిస్తున్నారు. దీంతో మంచి కాలేజీలో సీటు వస్తే బ్రాంచీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫలానా కాలేజీల్లో సీఎస్‌ఈ రాదని తెలిసినప్పటికీ, తర్వాత శ్రేణిలో ఈసీఈ లేదా సివిల్‌ బ్రాంచీలను ఎంచుకుంటున్నారు. ఇలా మారిన ఆప్షన్లు దాదాపు 3.2 లక్షల వరకూ ఉన్నాయి. ఈసీఈ బ్రాంచీ చేయాలనుకుని, ర్యాంకు ప్రకారం సరైన ఆప్షన్‌ ఇవ్వని విద్యార్థులు 1.2 లక్షల మంది వరకూ ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు బ్రాంచీ ప్రాధాన్యతగా ఆప్షన్లు మార్చుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెల 10న వెల్లడయ్యే అసలు కౌన్సెలింగ్‌ సీట్ల కోసం భారీగా కసరత్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement