ప్రగతి భవన్‌ ముట్టడి భగ్నం 

Opposition Leaders Arrested For Protest At Pragathi Bhavan - Sakshi

పలు పార్టీల ముఖ్య నేతల అరెస్టు

పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌/ముషీరాబాద్ ‌: ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించిన వివిధ పార్టీల నాయకులను పోలీసులు శుక్రవారం ఎక్కడికక్కడే అరెస్ట్‌ చేసి నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు, తెలంగాణ జన సమితి (టీజేఎస్‌), టీటీడీపీల ఆధ్వర్యంలో ‘ముఖ్యమంత్రి మేలుకో.. ప్రజల ప్రాణాలు కాపాడు.. బతుకులు నిలబెట్టు’అనే నినాదంతో ప్రగతి భవన్‌ వద్ద నిరసనకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేస్తారని భావించిన ఆ పార్టీల నేతలు గురువారం రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నేరుగా ప్రగతి భవన్‌ వద్ద ప్రత్యక్షమయ్యారు. మొదటగా టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్, ఆ పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు ఎం.నర్సయ్యలతో పాటు న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు గోవర్ధన్, ప్రసాద్, పీవోడబ్ల్యూ నేత వి.సంధ్య తదితరులు ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు.

ఇక పంజాగుట్ట చౌరస్తాలో సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్, ఈశ్వర్‌రావు తదితరులను అరెస్ట్‌ చేసి అక్కడికే తరలించారు. పీపీఈ కిట్‌ ధరించి ప్రగతి భవన్‌ ముట్టడికి వచ్చిన సీపీఐ నేత కె.నారాయణ, ఆ పార్టీ నాయకులు అజీజ్‌ పాషా, బాలమల్లేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని గోల్కొండ చౌరస్తా వద్ద అరెస్ట్‌ చేసి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణను ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద అడ్డుకొని నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నగరంలో ఎల్‌బీ నగర్, ఉప్పల్, ముషీరాబాద్, ఎంజే మార్కెట్, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్టలతో పాటు పలు ప్రాంతాల్లో నల్ల బెలూన్లను ఎగురవేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని, కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. అమెరికాలో వైట్‌హౌస్‌ ముందు నిరసనలకు అవకాశం ఉండగా, తెలంగాణలో మాత్రం సీఎం నివాసం వద్ద నిరసనలు తెలిపే అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top