
ఇంజనీరింగ్ ఆప్షన్లు సరిచేసుకోవడానికి అవకాశం
అతి విశ్వాసంతో సీటు పోగొట్టుకున్న టాపర్స్
2 వేల ర్యాంకు వచ్చినా సీటు రాని వైనం.. ఆలోచించి ఆప్షన్లు ఇవ్వాలంటున్న నిపుణులు
ఈ నెల 18న తొలి విడత సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విద్యార్థులకు అనేక అనుభవాలను నేర్పింది. ఆప్షన్ల ఎంపికలో అతి విశ్వాసం పనికిరాదని స్పష్టం చేసింది. మంచి ర్యాంకు వచ్చినా తక్కువ ఆప్షన్లు పెట్టడం వల్ల సీటు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కోరుకున్న బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే, ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించకపోతే అసలు సీట్ల కేటాయింపులో నష్టం జరిగే వీలుంది.
ఆప్షన్లు ఇవ్వడంలో పొరపాట్లు చేసిన వారు ఇప్పుడు వాటిని సరి చేసుకుంటారు. దీంతో ఈ నెల 18న చేపట్టే అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు ఉండే వీలుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే జాగ్రత్తగా అప్షన్లు మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.
2 వేల ర్యాంకుకూ సీటు రాలే..
మాక్ సీట్ల కేటాయింపులో 83,054 సీట్లకు 77,154 సీట్లు భర్తీ అయ్యాయి. దాదాపు 95 వేల మంది విద్యార్థులు ఆప్షన్లపై కసరత్తు చేశారు. అయితే, 16,905 మంది ఆప్షన్లు ఇచ్చినా సీట్లు పొందలేకపోయారు. వీళ్లంతా తక్కువ కాలేజీలు, కొన్ని బ్రాంచీలను మాత్రమే ఎంచుకున్నారు. మొదటి దశ కౌన్సెలింగ్ కాబట్టి జేఈఈ ద్వారా జాతీయ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా రాష్ట్ర ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేశారు.
ఎక్కువ ఆప్షన్లు ఇవ్వకపోవడం వల్ల మంచి ర్యాంకు వచ్చినా వారికి సీటు రాలేదు. ఒక విద్యార్థినికి ఎప్‌సెట్‌లో 2 వేల ర్యాంకు వచ్చింది. అయినా మాక్ సీట్ల కేటాయింపులో సీటు రాలేదు. ఒక విద్యార్థికి 50 వేల ర్యాంకు వచ్చినా టాప్ 15 జాబితాలో ఉన్న కాలేజీలో సీఎస్‌ఈ బ్రాంచీలో సీటు వచ్చింది. ఇతను ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది.
జాగ్రత్తగా ఆప్షన్లు ఇవ్వాలి
ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ వైపు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2023–24తో పోలిస్తే 2024–25లో 16 వేల మంది పెరిగి, 1.07 లక్షలకు ఇంజనీరింగ్ ప్రవేశాలు చేరాయి. కాబట్టి ఎప్‌సెట్ అసలు సీట్ల కేటాయింపులో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ఆప్షన్లు ఇచ్చినవాళ్లు ఈసారి వాటిని పెంచుతారు.
మంచి ర్యాంకులు ఉండి సీట్లు వచ్చిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో మార్పులు కోరుకుంటారు. కాబట్టి మాక్‌లో వచ్చిన సీటు అసలు కేటాయింపులో ఉండకపోవచ్చు. 20 వేల ర్యాంకుపైన వచ్చిన విద్యార్థుల దీన్ని ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలని, ఇందుకు తగ్గట్టుగా ఆప్షన్ల ఎంపికపై కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.