రామప్పకు ఎన్నడూ ఎరుగని ముప్పు! | Open-Cast Mining Poses Threat To Ramappa Temple: Telangana | Sakshi
Sakshi News home page

రామప్పకు ఎన్నడూ ఎరుగని ముప్పు!

Oct 5 2026 3:25 AM | Updated on Oct 5 2026 3:27 AM

Open-Cast Mining Poses Threat To Ramappa Temple: Telangana

5 కి.మీ. దూరంలో భారీ ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గని 

తవ్వకాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సింగరేణి

40 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసే చాన్స్‌ ఉందని అంచనా 

పేలుళ్లతో రామప్ప నిర్మాణానికి, చెరువుకు ముప్పు! 

యునెస్కో గుర్తింపు రద్దయ్యే ప్రమాదం

గతంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచి్చనా ‘వారసత్వ హోదా’ కారణంగానే వెనక్కి.. ఇప్పుడు మళ్లీ ఈ గనిపై దృష్టి పెట్టిన సింగరేణి  

న్యాయ పోరాటం చేసే యోచనలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు 

ఈ గనికి ప్రత్యామ్నాయంగా వేరేచోట గనులు ఇస్తామన్న కేంద్రం! 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక  ప్రపంచ వారసత్వ హోదా కలిగిన రామప్ప గుడి, వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న రామప్ప చెరువు ఉనికికి భవిష్యత్‌లో ముప్పు తెచ్చే పరిణామం వేగంగా చోటు చేసుకుంటోంది. వీటికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భారీ ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ గని కేటాయింపు ప్రతిపాదన దశాబ్దం క్రితమే వచ్చినా, రామప్పకు ముప్పు అనే కారణంతోనే నిలిచిపోయింది.

రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు యునెస్కో సిద్ధమైన వేళ, బొగ్గుగని ఏర్పాటు వల్ల అది దక్కకుండా పోతుందన్న ఆందోళనలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. దీంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తర్వాత 2021లో యునెస్కో దీనికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు ఇచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు సింగరేణి సంస్థ బొగ్గు గనిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమవుతోంది. 

గని ప్రతిపాదనపై ఆందోళనలు 
వేల ఎకరాల విస్తీర్ణంతో కూడిన ఈ గని అందుబాటులోకి వస్తే దాదాపు వెయ్యి అడుగుల లోతు వరకు బ్లాస్టింగ్స్‌తో తవ్వకాలు సాగనున్నాయి. ఈ గని 19 ఏళ్ల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో, ఆ పేలుళ్ల ప్రకంపనలతో రామప్ప నిర్మాణం దెబ్బతిని కూలిపోయే ప్రమాదం ఉందని, యునెస్కో కూడా తన గుర్తింపును రద్దు చేసే పరిస్థితి ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

30 వేల ఎకరాలకు సాగునీటిని అందించే రామప్ప చెరువు కూడా ధ్వంసం అవటంతో పాటు, అందులోని నీళ్లు సునామీ తరహాలో ఎగసి రామప్ప నిర్మాణంతో పాటు చుట్టు పక్కల ఊళ్లను ముంచెత్తే ప్రమాదం కూడా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ బొగ్గు గనికి ఎన్‌ఓసీలు లభించిన నేపథ్యంలో.. రామప్పకు యునెస్కో గుర్తింపు రావటంలో అన్నీ తానై వ్యవహరించిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఓపెన్‌ కాస్ట్‌ గనికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో గనులు కేటాయిస్తానని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదానికీ తెర తీసేలా కనిపిస్తోంది.  

ఎన్‌ఓసీలు వచ్చిన తర్వాత వేగంగా చర్యలు 
    ములుగు జిల్లా పాలంపేటలోని 800 ఏళ్లనాటి కాకతీయ అద్భుత నిర్మాణం రామప్ప గుడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపూర్‌ వద్ద పీవీఎన్‌ఆర్‌ ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనిని సింగరేణి గతంలోనే ప్రతిపాదించింది. అక్కడ దాదాపు 40 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికి తీసే అవకాశం ఉందని సంస్థ అంచనా కొచ్చింది. ఇది కార్యరూపం దాలిస్తే 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపి బొగ్గు నిల్వలను వెలికి తీస్తారు.

కాగా దీనిపై సింగరేణి కాలుష్య నియంత్రణ మండలి, జీఎస్‌ఐ, ఎన్‌ఐటీ సూరత్కల్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీలను సింగరేణి సంప్రదించింది. కొన్నేళ్ల ప్రయత్నం తర్వాత బొగ్గు గనికి ఎన్‌ఓసీలు వచ్చాయి. దీంతో వేగంగా చర్యలు చేపట్టింది. రామప్ప ఉన్న పాలంపేట డెవలప్‌మెంట్‌ అథారిటీ తాజాగా సమావేశమై సానుకూలంగా వ్యవహరించింది. అయితే ఆ అథారిటీలో మెంబర్‌గా ఉన్న, రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం తీవ్రంగా కృషి చేసిన కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ మరోసారి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది.  

నిపుణులతో కాకతీయ ట్రస్ట్‌ సంప్రదింపులు 
    కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ నిపుణులను సంప్రదిస్తూ, ఈ బొగ్గు గనితో రామప్ప కట్టడానికి, రామప్ప చెరువుకు ఉన్న ప్రమాదాలపై అంచనాలు రూపొందిస్తోంది. ప్రతిపాదిత గని ప్రాంతం ప్రాణహిత–గోదావరి బేసిన్‌లో భాగంగా ఉంది. ఇక్కడ పాఖాల్, సుల్లవాయి, లోయర్, అప్పర్‌ గోండ్వానాల ఇసుకరాయి, షేల్, కాంగ్లొమెరేట్స్, బొగ్గు పొరలు విస్తారంగా ఉన్నాయి.

ఈ ప్రాంతం నిర్మాణపరంగా అనేక భారీ, సూక్ష్మ ఫాల్ట్సŠ, లీనియమెంట్లు (ఆకృతులు), జాయింట్లు, ఫ్రాక్చర్ల (పగుళ్లు)తో విభజితమై ఉందని జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలోని వివరాలను ఉటంకిస్తూ ఆ ట్రస్టు ప్రతినిధులు చెబుతున్నారు. ఈ లీనియమెంట్లు, ఫాల్ట్సŠ, బెడ్డింగ్‌ జాయింట్ల ద్వారానే భూగర్భ జలాల ప్రవాహం సాగుతుంది. 300 మీటర్ల లోతున ఓపె¯న్‌ కాస్ట్‌ తవ్వకాలు జరిగితే రామప్ప చెరువు నీటిమట్టం–గని ప్రాంతం మధ్య హైడ్రాలిక్‌ గ్రేడియంట్‌ (నీటి ప్రవాహ మార్గంలో రెండు పాయింట్ల మధ్య ఉండే వాలు)లో మార్పులు రావొచ్చని విశ్లేషింస్తున్నారు. 

నీళ్లు వేగంగా లీక్‌ అయ్యే చాన్స్‌ 
    సుమారు 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామప్ప చెరువు రెండు భారీ గుట్టలను కలుపుతూ నిర్మించిన మట్టి కట్ట ఆధారంగా ఏర్పడింది. ఈ కట్టకు కట్‌ ఆఫ్‌ ట్రెంచ్‌ (గాడి/కందకం)లాంటిది ఏమీ లేదని సాంకేతిక విశ్లేషణలో భాగంగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితిలో గని తవ్వకాలతో అధిక హైడ్రాలిక్‌ గ్రేడియంట్‌ ఏర్పడితే.. చెరువులోని నీరు భూగర్భంలోని లీనియమెంట్లు, ఫాల్ట్సŠ, పగుళ్ల ద్వారా వేగంగా లీక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 

అదే జరిగితే భారీగా నీరు బయటకు ఎగసి చెరువు కట్టకు నష్టం కలగడంతోపాటు దిగువ ప్రాంతాల్లోని గ్రామాలు, ప్రజలు, ఆస్తులకు తీవ్ర ముప్పు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషించారు. ఇక రామప్ప దేవాలయం అలనాటి ఇసుక పునాది సాంకేతికత ఆధారంగా నిర్మించారు. ఇప్పటికే రంగ మండపంలోని భారీ ఫ్లోర్‌ బీముల్లో పెద్ద పగుళ్లు ఉన్నాయి. బొగ్గు కోసం గనిలో జరిపే వరుస పేలుళ్లతో ఆలయం తీవ్ర ప్రమాదంలో పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లతో పైకి ఎగసే బొగ్గు పొడి నిర్మాణంపై రసాయన చర్యకు కూడా కారణమవుతాయని అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement