మంచానికే పరిమితమైన తల్లిదండ్రులు

Old Age Pension Tragedy In Rajanna District - Sakshi

సాక్షి, తంగళ్లపల్లి(కరీనంగర్‌): మంచానికే పరిమితమైన తల్లిదండ్రులకు పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలని తనయుడు వేడుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక కనీసం ఒక్కపూట భోజనం అందించలేని స్థితిలో ఉన్నానని ఆర్థికసాయంకోసం ఎదురుచూస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పెకుడ యాదయ్య(58) –రాదవ్వ(54) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు అంజమ్మ, మమత, కొడుకు రాజు సంతానం. కూతుర్ల వివాహాలుకాగా 22 ఏళ్ల కొడుకు రాజు అవివాహితుడు. పదేళ్లక్రితం రాదవ్వ వ్యాధిబారిన పడి రెండుకాళ్లు పని చేయకుండా మంచానపడింది. యాదయ్య, రాజు ఇన్నాళ్లూ బతుకు బండి లాగిస్తున్నారు. ఒకరు పనికి వెళ్తే మరొకరు రాదవ్వను చూసుకునేవారు. కుటుంబంపై విధి పగబట్టింది. యాదయ్య కూడా రెండునెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వీరిద్దరి బాధ్యత రాజుపై పడింది. 

ఆకలితో పోరాటం
రాజు బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్కులో పవర్‌లూమ్‌ కార్మికుడిగా, టాకాలు పట్టే కార్మికుడిగా, వాచ్‌మన్‌గా పనులు చేశాడు. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు వచ్చేవి. తల్లిదండ్రుల మందులకే రూ.10 వేలు ఖర్చు  అయ్యేవి.  ప్రస్తుతం తల్లిదండ్రులను వదిలి పనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. ఆర్థికపరిస్థితి క్షీణించింది. తినడానికి తిండి లేని దుస్థితి ఏర్పడింది. తోడబుట్టిన వారు పలుమార్లు ఆర్థికంగా ఆదుకున్నా..నెలకు రూ.10 వేలు మందులకు ఖర్చు అవుతుండడం రాజుకు భారంగా మారింది.  

వ్యవసాయ కాలేజీ నిర్మాణంలో పోయిన భూమి 
పెకుడ యాదయ్యకు జిల్లెల్ల శివారులో 1 ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమి ఉండగా వ్యవసాయ కాలేజీ నిర్మాణ సమయంలో ప్రభుత్వం తీసుకుంది. రాళ్లు రప్పలు కలిగిన ప్రాంతంలో 1:20 ఎకరం భూమిని ప్రభుత్వం ఇవ్వగా అది వ్యవసాయ యోగ్యంకాకపోవడంతో ఎందుకు పనిరాకుండా ఉంది. రాదవ్వ అంగవైకల్యంతో బాధపడుతుండగా, యాదయ్య  రెండునెలలుగా కాళ్లు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. వీరిద్దరు  పింఛన్‌ పొందేందుకు అర్హులు.

కాళ్లు మొక్కుత పింఛన్‌ ఇయ్యిండ్రి..
అయ్యాసార్లు కాళ్లు మొక్కుతా..పదేండ్ల సంది మంచంలనే ఉంటున్న. ఒక్క పోరడు కన్న తండ్రి లెక్క అన్ని చేస్తుండు. తినడానికి తిండి కూడా లేదు దయచేసి పింఛన్‌ ఇప్పిస్తే ఒక్కపూట తిండైనా దొరుకుతది.        

 – పెకుడ రాదవ్వ, జిల్లెల్ల

ఆదుకోండ్రి సారు 
అమ్మనాయినలను కాపాడుకుంటా దయచేసి ఆర్థికంగా సాయాన్ని అందించండి. ప్రభుత్వం తరఫున ఏదైనా ఆర్థికసాయం చేయండి. చిన్నపాటి ఉద్యోగం ఇప్పిస్తే నా తల్లిదండ్రులను సాదుకుంటా..సాయం చేయండి. పేదరికంలో ఉన్నాం. దాతలు ఆదుకోండి.

– పెకుడ రాజు, జిల్లెల్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top