మంత్రులు.. తొలి సంతకాలు | Sakshi
Sakshi News home page

మంత్రులు.. తొలి సంతకాలు

Published Mon, May 1 2023 3:58 AM

Officers of the concerned departments signed the first signatures on the prepared files. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సచివాలయ ప్రారంభం అనంతరం మంత్రులు వారికి కేటాయించిన చాంబర్లకు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. 

ఏ మంత్రి.. ఏ ఫైలుపై సంతకం చేశారంటే.. 
కేటీఆర్‌ (ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ): డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. 

హరీశ్‌రావు (ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల భర్తీ ఫైలుపై తొలి సంతకం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం కింద రూ.151.64 కోట్ల నిధుల విడుదల ఫైలుకూ క్లియరెన్స్‌. 

గంగుల కమలాకర్‌ (పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ): అంగన్‌వాడీలకు పోషకాలతో కూడి న సన్నబియ్యం పంపిణీ ఫైలుపై తొలి సంతకం. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళికల ఫైలుపై మరో సంతకం. 

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (పశుసంవర్థక, మత్య్స శాఖ): ఉచిత చేపపిల్లల పంపిణీ ఫైలుపై తొలిసంతకం చేశారు. గొర్రెల పంపిణీ కోసం ఎన్‌సీడీసీ నిధుల విడుదల, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీ పనులకు రూ.75కోట్ల గ్రాంటు విడుదల ఫైళ్లకు ఆమోదం. 

సత్యవతి రాథోడ్‌ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ): అంగన్‌వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సంపూర్ణ ఆహార పథ కానికి ఇకపై బలవర్ధక సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని అందించే ఫైలుపై తొలి సంతకం. 

మల్లారెడ్డి (కార్మిక, ఉపాధి కల్పన శాఖ): కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వనున్న శ్రమశక్తి అవార్డుల ఫైలుపై తొలి సంతకం. 

కొప్పుల ఈశ్వర్‌ (ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ): దళితబంధు పథకం రెండో విడత లబ్దిదారుల ఎంపిక ఫైలుపై తొలి సంతకం. 

ఎర్రబెల్లి దయాకర్‌రావు (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ): రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మండలాల్లో ఐకేపీ భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం. 

మహమూద్‌ అలీ (హోంమంత్రి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు కమిషనరేట్లలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలీస్‌ స్టేషన్లలో పోస్టుల మంజూరు ఫైలుపై తొలి సంతకం. 

శ్రీనివాస్‌గౌడ్‌ (ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ): రాష్ట్రంలో చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ క్రీడాపోటీల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం.  

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వ్యవసాయ, సహకార శాఖ): రైతులకు రాయితీపై పచి్చరొట్ట విత్తనాల పంపిణీ ఫైలుపై తొలి సంతకం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం. 

వేముల ప్రశాంత్‌రెడ్డి (రోడ్లు, భవనాల శాఖ): రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై తొలి సంతకం.  

జగదీశ్‌రెడ్డి (విద్యుత్‌ శాఖ): వ్యవసాయానికి రూ.958.33 కోట్ల విద్యుత్‌ రాయితీ విడుదల ఫైలుపై తొలి సంతకం. 

ఇంద్రకరణ్‌రెడ్డి (దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వంద ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైలుపై తొలి సంతకం. ప్రధాన దేవాలయాల్లో తృణధాన్యాలతో కూడిన ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైలుపై రెండో సంతకం. 

సబితారెడ్డి (విద్యాశాఖ): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 19,800 మంది టీచర్లకు రూ. 34. 25 కోట్లతో ట్యాబ్‌లు అందజేసే ఫైలుపై తొలి సంతకం. 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్‌ల ఏర్పాటు ఫైలుపై మరో సంతకం. 

అజయ్‌కుమార్‌ (రవాణాశాఖ): కొత్త జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం.

Advertisement
 
Advertisement
 
Advertisement