బయోమాస్‌పెల్లెట్లతో పవర్‌!

NTPC Decided To Use Biomass Pellets Combination With Coal To Generate Electricity - Sakshi

బొగ్గుతో కలిపి 5–10% పెల్లెట్లు వాడాలని కేంద్రం ఆదేశం   

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రమవడంతో ప్రత్యామ్నాయాలపై నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ) దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బయోమాస్‌ పెల్లెట్లను బొగ్గుతో కలిపి విద్యుదుత్పత్తికి వాడాలని నిర్ణయించింది. టొర్రిఫైడ్‌ బయోమాస్‌ పెల్లెట్ల ఉత్పత్తికి భారతీయ స్టార్టప్‌ కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. సరఫరాదారులతో ఏడేళ్ల కాలవ్యవధితో ఒప్పందాలు చేసుకోనుంది. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గుతో పాటు 5–10 శాతం బయోమాస్‌ను ఇంధనంగా వాడాలని కేంద్రం ఆదేశించడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. బొగ్గు కొరత, ధరలు పెరిగి దేశ విద్యుత్‌ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు తీవ్రమై ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కేంద్రం పలు ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దీనికి తోడు బయోమాస్‌ పెల్లెట్ల వాడకానికీ ఆదేశాలు జారీ చేసింది. 

ఇకపై తప్పనిసరి
కొత్త బయోమాస్‌ వినియోగ పాలసీ ప్రకారం.. బాల్‌ మిల్, ట్యూబ్‌ మిల్‌ తరహావి మినహా మిగతా అన్ని థర్మల్‌ ప్లాంట్లు బొగ్గులో 5–10 శాతం బయోమాస్‌ను కలిపి వాడాలి. బాల్‌ మిల్‌ తరహా విద్యుత్‌ కేంద్రాలు రెండేళ్లపాటు 5 శాతం, తర్వాతి నుంచి 7 శాతం బయోమాస్‌ను వాడాలి. బాల్‌ అండ్‌ రేస్‌ మిల్‌ తరహావి 5 శాతం బ్లెండ్‌ చేసిన బయోమాస్‌ పెల్లెట్లను.. బాల్‌ అండ్‌ ట్యూబ్‌ మిల్‌ తరహా ప్లాంట్లు 5 శాతం టొర్రిఫైడ్‌ బయోమాస్‌ పెల్లెట్లను తప్పనిసరిగా వాడాలి. ఇప్పటినుంచి 25 ఏళ్లు, లేదా విద్యుత్‌ కేంద్రాల జీవితకాలం పాటు ఈ విధానం అమలు చేయాలి. 

బయోమాస్‌.. టొర్రిఫైడ్‌ పెల్లెట్లు
జంతువుల అవశేషాలు, విసర్జితాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. అన్నింటిని పొడిచేసి యంత్రాల సాయంతో స్తూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వీటినే సాధారణ బయోమాస్‌ పెల్లెట్స్‌ అంటారు. ఇప్పటివరకు సాధారణ బాయోమాస్‌ పెల్లెట్ల వాడకంపై దృష్టి సారించిన ఎన్టీపీసీ.. ఇకపై భారీ మొత్తంలో బయోమాస్‌ వాడకాన్ని ప్రోత్సహించేందుకు గాను టొర్రిఫైడ్‌ పెల్లెట్లను వాడాలని నిర్ణయించింది. సాధారణ బయోమాస్‌లో తేమను పూర్తిగా తొలగించి తీవ్ర ఉష్ణోగ్రతలో ఒత్తిడికి గురిచేసి గట్టిగా ఉండే పెల్లెట్లను తయారు చేస్తారు. బాగా మండేందుకు వీలుగా కొన్ని  రసాయనాలు కలుపుతారు. వీటినే టొర్రిఫైడ్‌ బయోమాస్‌ పెల్లెట్లు అంటారు. ఈ తరహా పెల్లెట్ల నుంచి ఎక్కువ మంట, ఉష్ణోగ్రత వెలువడతాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top