పీజీ మెడికల్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్‌ | Notification for PG Medical Convenor Quota Seats | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్‌

Jul 10 2023 3:12 AM | Updated on Jul 10 2023 3:12 AM

Notification for PG Medical Convenor Quota Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పీజీ మెడికల్‌ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వినర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్‌)– 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు దర­ఖాస్తు చేసుకోవచ్చు. 

నేటినుంచి 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్
ఈ నెల 10వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వర్సిటీ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు.

మెరిట్‌ జాబితా విడుదల అనంతరం వెబ్‌ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో నోటి­­ఫికేషన్‌ జారీచేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రా­ధాన్యక్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అనం­తరం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుంది. ఇతర సమాచారానికి  యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www. knruhs. telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ తెలిపింది.  

జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్‌ స్కోర్‌ 291 మార్కులు 
అభ్యర్థులు నీట్‌ పీజీలో కటాఫ్‌ స్కోర్‌ లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత 50 పర్సంటైల్‌ కాగా, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 291 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల కనీస అర్హత 40 పర్సంటైల్‌ కాగా, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 257 మార్కులు, దివ్యాంగుల కనీస అర్హత 45 పర్సంటైల్‌ కాగా, కట్‌ ఆఫ్‌ స్కోర్‌ 274 మార్కులు సాధించి ఉండాలని వర్సిటీ వెల్లడించింది.  

ఇతర ముఖ్యాంశాలు
అభ్యర్థి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపుపొందిన మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 
♦ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లేదా స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి శాశ్వత నమోదు చేసుకొని ఉండాలి.  
♦ కంపల్సరీ రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.  
♦ ఎంబీబీఎస్‌ చదివినవారు గుర్తింపు పొందిన మెడికల్‌ కాలేజీల నుండి వచ్చే నెల 11వ తేదీ లేదా అంతకు ముందు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. 11 ఆగస్టు 2023 నాటికి ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసే అభ్యర్థులు సంబంధిత మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ జారీ చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాలి. 
♦ సర్విస్‌లో ఉన్న అభ్యర్థుల విషయంలో 30 జూన్‌ 2023 నాటికి వారు అందించిన సేవలను పరిగణలోకి తీసుకుంటారు. 
 ఓసీ, బీసీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.5500 
♦  పీజీ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్‌ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5500 (బ్యాంక్‌ లావాదేవీల చార్జీలు అదనం), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5000 (బ్యాంకు లావాదేవీల చార్జీలు అదనం). రుసుమును డెబిట్‌ కార్డ్‌ / క్రెడిట్‌ కార్డ్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.  
♦ అభ్యర్థులు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, అడ్మిట్‌ కార్డ్, నీట్‌ పీజీ ర్యాంక్‌ కార్డ్, ఒరిజినల్‌ లేదా ప్రొవిజనల్‌ డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్‌ కార్డ్, ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్, పర్మినెంట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తదితరాలు సమర్పించాలి.   
♦ ఆన్‌లైన్‌ దరఖాస్తును సమర్పించడానికి అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైతే సాయం కోసం 9392685856, 7842542216 నంబర్లను సంప్రదించవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement