పెద్ద ముప్పేమీ లేకున్నా అజాగ్రత్త వద్దు..

Not Dangerous But Should Be Careful With Corona Virus Says Rakesh K Mishra - Sakshi

పెద్ద ముప్పేమీ లేకున్నా అజాగ్రత్త వద్దు..

కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ సదస్సులో సీసీఎంబీ డైరెక్టర్‌ 

ఇక్కడ విస్తరించే అవకాశం తక్కువ.. టీకాలకు ఆశించిన స్పందన రావట్లేదు.. వ్యాక్సిన్‌పై అపోహలొద్దు

అన్ని టీకాలు సురక్షితమైనవేనన్న రాకేశ్‌ మిశ్రా

సాక్షి, హైదరాబాద్‌: ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తున్నంత వేగంగా తెలంగాణలో కరోనా వైరస్‌ విస్తరించే అవకాశం తక్కువ అని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌ కె.మిశ్రా చెప్పారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటికే 55.5శాతం మందిలో యాంటీ బాడీస్‌ వృద్ధి చెందినట్లు తమ పరిశోధనలో వెల్లడైందని.. దీనికితోడు ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల ఇక్కడ వైరస్‌ ఉధృతి తక్కువగా ఉందని పేర్కొ న్నారు. కరోనా వ్యాక్సిన్లు సురక్షితమేనని భరోసా ఇచ్చారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 14 రోజులకు యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతా యని.. అయితే 20 నుంచి 30% మందిలో తొలి డోసుతోనే వృద్ధి చెందినట్లు గుర్తించామని తెలి పారు. కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ ఆరో వార్షిక సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది కార్డియాలజిస్టులు దీనికి హాజరయ్యారు. ఈ సదస్సులో రాకేశ్‌ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా టీకాల కార్యక్రమానికి వైద్య సిబ్బంది నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని, అన్ని వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా అవసరమన్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి
కోవిడ్‌ నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్లే ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని రాకేశ్‌ మిశ్రా చెప్పారు. ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతోనే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిందని.. శుభకార్యాలు, తీర్థయాత్రలు, విహారయాత్రల కోసం కాదని పేర్కొన్నారు. వైరస్‌ పీడ ఇంకా పూర్తిగా తొలగిపోలేదని.. ఈ విషయం తెలియక చాలా మంది సినిమాలు, షికార్లు, పార్టీలు, ఫంక్షన్ల పేరుతో గుమిగూడుతున్నారని చెప్పారు. అలాంటి వారి ద్వారా ఇంట్లో ఉన్న వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతర వ్యాధిగ్రస్తులు వైరస్‌ బారిన పడుతున్నారని వివరించారు.

టీకాతో గుండెపోటు ముప్పు ఉండదు
కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ సదస్సు నిర్వాహకులు డాక్టర్‌ కేఎంకేరెడ్డి, డాక్టర్‌ ఆర్కే జైన్‌ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత కేసులు పెరిగాయనే ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. సాధారణ రోజుల్లో ఎంత మంది గుండెపోటుకు గురయ్యారో.. కోవిడ్‌ టీకా తీసుకున్న తర్వాత అంతే మంది అనారోగ్యం బారిన పడ్డారని వివరించారు. తనతోపాటు చాలా మంది వైద్యులు ఇప్పటికే రెండో డోసు టీకా తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని, అంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top