అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావుండొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్రం దాన్ని గుర్తించి తెలంగాణ పురోగతికి సహకరించాలి
రాష్ట్ర పురోగతిలో కీలకమైన రోడ్డు ప్రాజెక్టుల్లో జాప్యం చేయొద్దు
దేశ ప్రగతికి తెలంగాణ తనవంతు తోడ్పాటు అందిస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలప్పుడు ఎవరిస్థాయిలో వారు రాజకీయాలు చేసినా, ఆ తర్వాత దేశాభివృద్ధి లక్ష్యంగానే పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను అదే పద్ధతిలో ఉంటానని, కేంద్రప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి తెలంగాణ పురోగతికి కావాల్సిన సహకారం అందించాలని కోరారు. ఇండియన్ రోడ్స్‌కాంగ్రెస్ (ఐఆర్‌సీ) కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగానికి ముందు రేవంత్ మాట్లాడారు.
అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్రానికి సంబంధించిన రీజినల్ రింగురోడ్డు లాంటి కీలక ప్రాజెక్టులు సహా పెండింగులో ఉన్న రోడ్డు ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ కేంద్రం వెంటనే వాటిని క్లియర్ చేయాలని కోరారు. రేవంత్ ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి పేర్కొన్న రోడ్డు ప్రాజెక్టులను తాను వల్లెవేయాల్సిన అవసరం లేదని, అవి రాష్ట్ర పురోగతిలో భాగస్వామ్యమయ్యేవని, వాటి విషయంలో జాప్యం లేకుండా చూడాలని గడ్కరీ దృష్టికి తెచ్చారు.
తెలంగాణ రైజింగ్ విజన్‌తో ముందుకు...
నిర్దేశించిన లక్ష్యాల సాధనలో దేశం ప్రగతి సాధించడానికి తనవంతు కర్తవ్యంగా తెలంగాణ కూడా తోడ్పాటును అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యానికి తగినట్లు తెలంగాణ రైజింగ్ విజన్‌తో ముందుకు సాగుతోందని, 2034 నాటికే ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సంపన్న దేశాలు గొప్ప రహదారులను నిర్మించవని, గొప్ప రహదారులే దేశాలను ధనిక, అభివృద్ధి చెందిన దేశాలుగా మారుస్తాయని అన్నారు.
ఆర్థిక ప్రగతి కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని, అందులో ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ నగరాన్ని ‘క్యూర్’గా గుర్తించామని, అందులో సేవల రంగానికి ప్రాధాన్యమిస్తామన్నారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్యూర్ ప్రాంతాన్ని దేశంలోనే అతిపెద్ద తయారీ కారిడార్‌గా తీర్చిదిద్దుతామన్నారు. చైనా ప్లస్ వన్ అనే వ్యూహానికి ఇది తాము చూపే జాతీయ పరిష్కారమని తెలిపారు.
ఆర్‌ఆర్‌ఆర్ వెలుపలి నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ‘రేర్’ప్రాంతాన్ని వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమల కోసం అభివృద్ధి చేస్తామని వివరించారు. వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్‌పోగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ సదస్సుకు పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులు తరలిరావాలని ఆహా్వనించారు.
కేంద్రం సహకరించాలి మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో కీలక రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ‘హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగం)కు త్వరగా ఆమోదం వచ్చేలా చూడాలి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65)ను సరీ్వస్ రోడ్లతో సహా ఆరు లేన్లుగా విస్తరించేందుకు అనుమతులు మంజూరు చేయండి. హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు త్వరగా వచ్చేలా సహకరించండి’అని కోరారు.
హైదరాబాద్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుమతులు, 2,144 కి.మీ. మేర 23 రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయడం, ఎల్‌బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణం వంటి ప్రతిపాదనలనూ ప్రస్తావించారు. పారీ్టలకతీతంగా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారని పేరున్న గడ్కరీ.. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, డీకే ఆరుణ, ఎమ్మెల్యేలు గాం«దీ, లక్ష్మారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, రాకేశ్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, పలువురు ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ఐఆర్‌సీ సెక్రెటరీ జనరల్ రాహుల్ గుప్తా, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ పాడి, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్‌ఓ కృష్ణప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


