చెప్పులే ధరించాలి | Sakshi
Sakshi News home page

చెప్పులే ధరించాలి

Published Tue, Aug 1 2023 1:15 AM

No entry for exams if wearing shoes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పరీక్షలకు హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలు విధించింది. ప్రధానంగా ఎగ్జామ్‌హాల్‌లోకి వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈనెల 23వ తేదీ వరకు వరుసగా(సెలవులు మినహా) పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుదల చేసింది. ఇప్పటివరకు 88 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా, పరీక్ష సమయానికి గంటముందు వరకు డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు  టీఆర్‌ఈఐఆర్‌బీ కల్పించింది. ముందస్తుగా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని నిబంధనలు పాటించాలని, పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవని గురుకుల బోర్డు కన్వీనర్‌ మల్లయ్యబట్టు తెలిపారు.

  • అర్హత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి సెషన్, రెండోసెషన్‌ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, మూడోసెషన్‌ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. 
  • పరీక్ష సమయంకంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల వరకు మాత్రమే గేట్లు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. అధికారుల పరిశీలనలో సంతృప్తి చెందితేనే లోనికి పంపిస్తారు. 
  • అభ్యర్థులు తమ వెంట ఏదేని ఒక ఒరిజినల్‌ ఫొటో గుర్తింపుకార్డు (పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌) వెంట తీసుకెళ్లాలి. 
  • ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లిన తర్వాత అభ్యర్థి బయోమెట్రిక్‌ సమాచారం సేకరిస్తారు. 
  • ప్రతి పరీక్ష 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిర్దేశించిన గడువు తర్వాతే అభ్యర్థిని బయటకు పంపిస్తారు. 
  • ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌లో సాంకేతిక కారణాలతో ఫొటో ముద్రితం కాకుంటే ఒరిజినల్‌ ఫొటో అతికించి నిబంధనలకు అనుగుణంగా గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి హాజరుకావాలి. 

బోర్డు కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన
పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ కొందరు అభ్యర్థులు సోమవారం ఉదయం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఆందోళనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బోర్డు కార్యాలయ ఆవరణకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించడం, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం కత్తిమీద సాముగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఏమీ లేదని, అభ్యర్థులకు  సర్దిచెప్పి పంపించారు. 

Advertisement
 
Advertisement