సూడాన్‌ శిశువుకు పునర్జన్మ | Nilofar doctors save childs life by providing free treatment | Sakshi
Sakshi News home page

సూడాన్‌ శిశువుకు పునర్జన్మ

Jan 1 2025 2:05 AM | Updated on Jan 1 2025 2:05 AM

Nilofar doctors save childs life by providing free treatment

తొలుత కార్పొరేట్‌ హాస్పిటల్‌లో చికిత్స

డబ్బులు అయిపోవడంతో దంపతులను నిలోఫర్‌కు పంపించిన ఆస్పత్రి వర్గాలు

చిన్నారికి ఉచిత చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన నిలోఫర్‌ వైద్యులు  

సాక్షి, హైదరాబాద్‌/ నాంపల్లి: సూడాన్‌ దేశానికి చెందిన ఓ శిశువుకు హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న శిశువుకు సుమారు నెల రోజులపాటు నిలోఫర్‌లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సూడాన్‌ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్‌ ద్వారా బిడ్డను కనేందుకు ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో సయీదా అబ్దుల్‌ వాహెద్‌ అనే మహిళ ఐవీఎఫ్‌ చేయించుకుని నెలరోజుల క్రితం మగ పిల్లాడికి జన్మనిచ్చి0ది. 

శిశువుకు పుట్టుకతోనే బ్లడ్‌ ఇన్ఫెక్షన్, బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టుగా గుర్తించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరు రోజులపాటు కార్పొరేట్‌ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో సూడాన్‌ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో శిశువును నిలోఫర్‌కు రిఫర్‌ చేశారు. ఆ శిశువును అడ్మిట్‌ చేసుకున్న నిలోఫర్‌ డాక్టర్లు నెల రోజులపాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు. 

శిశువు తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. శిశువు పూర్తిగా కోలుకోవడంతో, మంగళవారం డిశ్చార్జ్‌ చేశామని చికిత్స చేసిన నిమోనాటాలజిస్ట్‌ డాక్టర్‌ స్వప్న తెలిపారు. తన బిడ్డను బతికించిన డాక్టర్లకు ఆ తల్లి (43 ఏళ్లు) కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇప్పటికే ఐదుసార్లు అబార్షన్‌ అయిందని, ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. 

చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు నిలోఫర్‌ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారన్నారు. విషమ పరిస్థితిలో ఉన్న శిశువుకు ట్రీట్‌మెంట్‌ అందించిన డాక్టర్ల బృందాన్ని, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement