రాత్రి ఉష్ణోగ్రతలు 3–4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం
ఈ నెల 20 నుంచి యాసంగి వరి నారుమళ్లు పోసుకోవచ్చు
30వ తేదీ వరకు వేరుశనగ, బొబ్బర్లు విత్తుకోవచ్చు
పీజేటీఎస్‌యూ వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 2–3 రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా శీతల గాలులు వీచే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌యూ)లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.లీలారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చు. రాబోయే 2–3 రోజుల్లో అక్కడక్కడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా ఉంటాయి.
వ్యవసాయ వాతావరణ సూచనలు
⇒ వేరుశనగ, బొబ్బర్లను ఈ నెల 30 వరకు విత్తుకోవచ్చు.
⇒ మినుములు, పెసర విత్తనాలను వచ్చే నెల 10 వరకు విత్తుకోవచ్చు.
⇒ జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను వచ్చే నెల 31 వరకు విత్తుకోవచ్చు.
⇒ యాసంగి వరి నారుమళ్లను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 మధ్యలో పోసుకోవచ్చు.
⇒ ఆలస్యంగా నాటుకున్న వానాకాలం వరిలో గింజమచ్చ తెగులు ఆశించే అవకాశముంది. నివారణకు 1 మి.లీ. ప్రోపికొనజోల్ + 1 మి.లీ. స్పైరోమెసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


