ఆ దాడి వెనుక తెలంగాణ మావోలు!

NIA Chargesheet Against Maoists 22 Policemen Were Killed In Bijapur District - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ టేకల్‌గుడియం ఘటనలో 23మందిపై ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌

ఉమ్మడి వరంగల్‌కు చెందిన 8మంది మావోయిస్టుల నేతలపై అభియోగాలు

ఆ ఘటనలో 22మంది పోలీసుల మృతి, 35మందికిపైగా గాయాలు

చర్చనీయాంశంగా మారిన ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా టార్రెమ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి టేకల్‌ గుడియం సమీపంలో పోలీసులపై జరిగిన దాడి ఘటన వెనుక తెలంగాణకు చెందిన మావోయిస్టు నేతలే కీలకంగా వ్యవహరించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చింది. ఈ ఘటనకు సూత్రధారులుగా 23మంది పేర్లను పేర్కొన్న ఎన్‌ఐఏ.. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎనిమిది మంది పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చింది.

2021 ఏప్రిల్‌ 3న జరిగిన ఈ దాడి ఘటనలో డీఆర్‌జీ, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌లకు చెందిన పోలీసులు 22మంది మృతి చెందగా, 35మందికిపైగా గాయపడ్డారు. సుమారు 21 నెలలపాటు విచా రణ జరిపిన ఎన్‌ఐఏ అధికారులు... దాడిలో 350 నుంచి 400 మంది వరకు సాయుధ మావోయి స్టులు పాల్గొన్నప్పటికీ  కేసులో (ఆర్‌సీ–02/ 2021/ఎన్‌ఐఏ/ఆర్‌పీఆర్‌) 23మందిపైన చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

సంచలనం కలిగించిన తారెం ఘటన
పోలీస్‌ సాయుధ బలగాలపై మెరుపుదాడి చేసిన ఆ ఘటన కేసును మొదట బీజాపూర్‌ జిల్లాలోని టార్రెమ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎఫ్‌ఐఆర్‌ నం.06/2021 ప్రకారం నమోదు కాగా, తర్వాత ఎన్‌ఐఏ ద్వారా 2022 జూన్‌ 5వ తేదీన తిరిగి నమోదు చేశారు. భద్రతా దళాలు సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పోలీసులపై బారెల్‌ గ్రెనేడ్‌ లాంచర్‌(బీజీఎల్‌)లు, ఆటోమేటిక్‌ ఆయుధాలతో కా ల్పులు జరిపి రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌ అనే కోబ్రా జవాన్‌ను కూడా అపహరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

తెలంగాణ అగ్రనేతలే సూత్రధారులు... 
21 నెలల విచారణ తర్వాత ఎన్‌ఐఏ తన దర్యా ప్తులో దాడి వెనుక సీపీఐ(మావోయిస్ట్‌) సీనియర్‌ నేతల పాత్ర ఉందని తేల్చింది. ఐపీసీలోని సెక్షన్లు– 120 రెడ్‌విత్‌/302 – 307, 396, 149, 121 మరియు 121ఎలతో పాటు భారతీయ ఆయుధ చట్టం, 1959లోని సెక్షన్లు– 25(1ఏ) – 27, ఈ చట్టం 1908లోని సెక్షన్‌ – 3, 4 – 6 మరియు సెక్షన్లు– 16, 18, 18ఏ, 20, యుఏ(పీ) చట్టం, 1967లోని 38ల కింద కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఇందులో కేంద్ర కమిటీ సలహాదారుడు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతితోపాటు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్‌ గంగన్న, కేంద్ర నాయకులు కటకం సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్, మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్‌ సోను, సుజాత అలియాస్‌ పోతుల కల్పన (మల్లోజుల కోటేశ్వర్‌రావు భార్య), ఉమ్మడి వరంగల్‌కు చెందిన సాగర్‌ అలియాస్‌ అన్నే సంతోష్, రఘు రెడ్డి అలియాస్‌ వికాస్, నిర్మల అలియాస్‌ నిర్మలక్కలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పొడియం హిద్మా అలియాస్‌ హిడ్మన్న, మద్నా అలియాస్‌ జగ్గు దాదాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర, దండకారణ్యం, ఏరియా కమిటీలకు చెందిన 15 మంది పేర్లను ఎన్‌ఐఏ ప్రధానంగా పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top