పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట  | Sakshi
Sakshi News home page

పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట 

Published Mon, Dec 18 2023 2:27 AM

New heights have started in the municipalities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో పురపాలికల్లో కొత్త ఎత్తులు మొదలయ్యాయి. సుమారు నాలుగేళ్లుగా పదవుల్లో కొనసాగుతున్న పాలక మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లతోపాటు మేయర్లపై ‘అవిశ్వాస పరీక్ష’అనే కత్తి వేలాడుతోంది. గత జనవరితో మూడేళ్ల పదవీ కాలం పూర్తవడంతో మునిసిపల్‌ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లను గద్దె దించాలని కొందరు సభ్యులు చేసిన ప్రయత్నాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నెరవేరలేదు.

దాదాపు 95 శాతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్‌ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లే ఉండటంతో అవిశ్వాసం ద్వారా ఎవరిని గద్దె దించినా.... రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో గులాబీ పెద్దలు వీరి ప్రయత్నాలకు చెక్‌ పెట్టారు. దీంతో రాష్ట్రంలోని 130 మునిసిపాలిటీలకుగాను 34 చోట్ల అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లాల కలెక్టర్లకు ఇచ్చినప్పటికీ, ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని 15 మంది చైర్మన్లు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే అధికారం దక్కిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లకు అవిశ్వాసంపై పెద్దగా టెన్షన్‌ లేనప్పటికీ, బీఆర్‌ఎస్‌లోనే ఉన్న మేయర్లు, మునిసిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లలో పదవీగండం భయం పట్టుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచిన జిల్లాల్లో బీఆర్‌ఎస్‌లో ఉన్న మునిసిపల్‌ చైర్మన్లు, మేయర్లు అవసరమైతే పార్టీ మారేందుకూ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో బీఆర్‌ఎస్‌ అసమ్మతి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్‌ వాళ్లతో కలిసి ప్రస్తుత పాలక మండళ్ల చైర్మన్లను, వైస్‌ చైర్మన్లను గద్దె దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.  

చాలాచోట్ల ప్రయత్నాలు షురూ 
ప్రస్తుతం రాష్ట్రంలోని నల్లగొండ, నేరేడుచర్ల, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, కోస్గి, ఆంథోల్‌ మునిసిపాలిటీల్లో ఇప్పటికే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇందులో బెల్లంపల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, సభ్యులు అవిశ్వాస నోటీసు ఇవ్వడం గమనార్హం. ఆర్నెల్ల క్రితం అవిశ్వాస నోటీసులు ఇచ్చిన మునిసిపాలిటీల్లో 15 మంది బీఆర్‌ఎస్‌ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, చాలాచోట్ల సభ్యులు వారిని గద్దె దించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు ఉన్న అన్ని మునిసిపాలిటీల్లో కలెక్లర్లకు అవిశ్వాస నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌ అసంతృప్త సభ్యులకు కాంగ్రెస్‌ సభ్యులు కూడా తోడవుతున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో సగం మునిసిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. ఇల్లందు, వైరా, జనగాం, భూపాలపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, పెద్దపల్లి, సుల్తానాబాద్, కోరుట్ల, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, కోదాడ, యాదగిరిగుట్టలో అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు అసమ్మతి సభ్యులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర సభ్యులతో కలిసి ఈ మేరకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు మునిసిపాలిటీల్లోనూ అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. 

కార్పొరేషన్లలో సైతం 
రాష్ట్రంలోని 13 మునిసిపల్‌ కార్పొరేషన్లలో హైదరాబాద్‌ మినహా మిగతా కార్పొరేషన్లలో సైతం అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ శివారులోని జవహర్‌నగర్, నిజాంపేట, బోడుప్పల్, ఫిర్జాదీగూడ కార్పొరేషన్లతోపాటు నిజామాబాద్, రామగుండం, ఖమ్మం వంటి కార్పొరేషన్లలో కూడా అవిశ్వానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ మేయర్, చైర్మన్లు ఉన్న పట్టణాల్లో కొంత భిన్నమైన వైఖరి ఉండే అవకాశం ఉంది. కలెక్టర్లకు నోటీసులు ఇచ్చిన తరువాత నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానానికి గడువు ఇచ్చి ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. అయితే అవిశ్వాస తీర్మానాలపై ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.  

Advertisement
Advertisement