
నేటి నుంచి నీట్ యూజీ రాష్ట్ర కోటా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
ప్రైవేటు వైద్య కళాశాలల్లో విద్యార్థుల చేరికలకు రంగం సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 కాలేజీల్లో కాళోజీ వర్సిటీ, ఎన్‌ఎంసీ తనిఖీలు
80 శాతం కళాశాలలు నిబంధనలను పాటించడం లేదని తేల్చిన వర్సిటీ
కేవలం 4 కళాశాలలకే జరిమానా విధించిన అధికారులు
జాతీయ వైద్య కమిషన్ సైతం మెతక వైఖరి అవలంబించిందనే విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు తెర లేస్తోంది. శనివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే పలు ప్రైవేటు కళాశాలల్లో నిబంధనల ప్రకారం మౌలిక వసతులు లేకపోయినా, అడ్మిషన్ల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసినా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ)తో పాటు కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం చూసీ చూడనట్టుగా వ్యవహరించి అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
నిబంధనలను పాటించని కళాశాలలకు ఎంబీబీఎస్ సీట్లలో కోత పెట్టడంతో పాటు కళాశాలల అనుమతి కూడా రద్దు చేసే అవకాశమున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 80 శాతం ప్రైవేటు కళాశాలలు రాజకీయ నేతలవి కావడం వల్లే తనిఖీలు చేసినా, ఏం చర్యలు తీసుకోలేకపోయాయని అంటున్నారు.
తనిఖీలు చేసినా..
రాష్ట్రంలో 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా, ప్రైవేటు రంగంలో 26 ఉన్నాయి. అందులో ఒక కళాశాలలో ప్రవేశాలను ఈసారి అనుమతించలేదు. మిగిలిన 25 కళాశాలలకు గాను దాదాపు 20 కళాశాలల్లో ఎన్‌ఎంసీతో పాటు కాళోజీ వర్సిటీ వేర్వేరుగా తనిఖీలు నిర్వహించాయి. వర్సిటీ తనిఖీల్లో కేవలం 20 శాతం కళాశాలల్లో మాత్రమే నిబంధనలను పాటిస్తూ వైద్య విద్య బోధన సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 80 శాతం ప్రైవేటు కళాశాలలు నిబంధనలను పాటించడం లేదని, విద్యార్థుల నుంచి ఫీజులు దండుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని తేలినా..వర్సిటీ కేవలం 4 కళాశాలలకు మాత్రమే జరిమానా విధించి సరిపుచ్చుకోవడం గమనార్హం.
మరోవైపు ఎన్‌ఎంసీ అధికారులు ప్రైవేటు కళాశాలల్లో జరిపిన తనిఖీల్లోనూ ఇదే పరిస్థితి కని్పంచింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ కూడా 8 ప్రైవేటు కళాశాలలపై జరిమానాలు విధించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేసి, 26 కళాశాలలు నిబంధనలు పాటించడం లేదని తేల్చిన ఎన్‌ఎంసీ అధికారులు.. ప్రైవే టు కాలేజీలపై మెతకవైఖరి అవలంబించారనే ఆరోపణలున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు, డమ్మీ పేషెంట్లు, డాక్టర్లను సమకూర్చుకొనేందుకు అవకాశం కల్పించి ఎన్‌ఎంసీ తనిఖీలు జరిపిందనే ఫిర్యాదులు రావడం గమనార్హం.
లెక్కల్లోనే రోగులు, బెడ్లు..
కాళోజీ యూనివర్సిటీ నిర్వహించిన తనిఖీల్లో ప్రైవేటు కళాశాలలకు సంబంధించి న ఏ బోధనాసుపత్రిలోనూ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు అనుగుణంగా బెడ్ల సామర్థ్యం, రోగుల సంఖ్య లేదని తేలింది. 80 శాతం కాలేజీలు కేవలం లెక్కల కోసమే బెడ్లు, రోగులు, ఫ్యాకల్టీని కాగితాలపై చూపించినట్లు స్పష్టమైంది. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం.. 100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో ప్రతీరోజు 600 మంది ఔట్ పేషెంట్లు, 400 మంది ఇన్‌పేషెంట్లు ఉండాలి. అదే 150 మంది విద్యార్థులు ఉంటే 610 ఇన్ పేషెంట్ పడకలు, ఓపీ కింద కనీసం 900 మంది రోగులు ప్రతీరోజు రికార్డు కావాలి. కానీ 20 కళాశాలల్లో త నిఖీలు జరిపితే అన్ని చోట్లా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పరిస్థితులే కనిపించినట్టు సమాచారం.
జరిమానాలు ఇలా..
రికార్డుల్లో 1,000 బెడ్లు ఉన్నట్లు చూపుతున్న కరీంనగర్‌కు చెందిన ఓ ఆసుపత్రిలో.. పది శాతం బెడ్లపై కూడా రోగులు లేనివైనంపై ఫొటోలతో సహా ఎన్‌ఎంసీకి నివేదిక పంపారు. ఈ కాలేజీకి వర్సిటీ అధికారులు రూ.20 లక్షల జరిమానా విధించారు. అయితే దీనిపై కళాశాల కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది.– 720 పడకలు కలిగిన సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ కళాశాలకు, 850 పడకలు ఉన్న మహేశ్వర కళాశాలకు కూడా రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించారు. అలాగే 150 ఎంబీబీఎస్ సీట్లు, 202 పీజీ సీట్లు 1,300 బెడ్లు కలిగిన అతిపెద్ద రాజరాజేశ్వరి వైద్య కళాశాలకు రూ.15 లక్షల జరిమానా విధించారు.
ఈ మూడు కాలేజీలు తమకు విధించిన జరిమానాను చెల్లించాయి. ఇలావుండగా అరుంధతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ‘ఆయాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీకి రూ.15 లక్షల చొప్పున ఎన్‌ఎంసీ జరిమానా విధించింది. అలాగే డాక్టర్ వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజీ, ‘నోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, ‘ఆర్‌వీఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’కు రూ.10 లక్షల చొప్పున, ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీ, టీఆర్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు రూ.20 లక్షల చొప్పున ఎన్‌ఎంసీ జరిమానా విధించింది.
నిబంధనల ఉల్లంఘనలు..
⇒ అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో నాలుగున్నరేళ్ల ఎంబీబీఎస్ కోర్సు కోసం ఐదేళ్ల కాలానికి ఫీజు వసూలు చేస్తున్నారు.
⇒ ఏ ప్రైవేటు కాలేజీలోనూ ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీల్లో నామమాత్రంగా రూ.3 వేల నుంచి రూ. 5 వేలు మాత్రమే ఇస్తున్నారు.
⇒ చాలా మెడికల్ కాలేజీల అనుబంధ ఆ సుపత్రులు వార్డు రూమ్‌లు తాళాలు వేసి ఉన్నా యి. బెడ్లు, పరికరాలు ఉన్నాయే తప్ప సిబ్బంది లేరు.
⇒ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏ ఒక్క కాలేజీలో కూడా కనీసంఫ్యాకల్టీ, కింది స్థాయి సిబ్బంది కూడా లేరు.