ఇండిగో విమానాల టైమింగ్స్‌పై 54 శాతం మంది ప్రయాణికుల అసంతృప్తి
సరైన సమాచారమే ఉండదని మరో 45% మంది వెల్లడి
బ్యాగేజీ హ్యాండ్లింగ్ సరిగా లేదన్న 42 శాతం మంది
లోకల్ సర్కిల్స్ సర్వేలో తమ అనుభవాలు వెల్లడించిన ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణి కులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే. అయితే సంవత్సర కాలంగా ఇండిగో విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు వివిధ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వారి అనుభవాల ద్వారా తెలుస్తోంది. ఇండిగో విమాన ప్రయాణికుల ఇక్కట్లపై లోకల్ సర్కిల్స్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయి.

ఇండిగో విమానాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. అలాగే ఇండిగో విమాన సిబ్బంది ప్రవర్తన సైతం సరిగా లేదని 54 శాతం మంది చెప్పారు. విమాన నిర్వహణ, భద్రత మొదలు లగేజీ నిర్వహణ వరకు అనేక అంశాలపై లోకల్ సర్కిల్స్ సంస్థ మొత్తం 15 వేల మంది ఇండిగో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది.


