
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావుకు ప్రోక్లేయిమ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, జూన్ 28వ తేదీలోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటిషన్లలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రోక్లేయిమ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఈ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 28వ తేదీలోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఆస్తులను పోలీసులు జప్తు చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ప్రభాకర్ రావు ఇంటికి నోటీసులు అంటించనున్నారు. ఆ తర్వాత బహిరంగంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.