
రూ.లక్షా పదివేల జరిమానా విధింపు
బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
నల్లగొండ పోక్సో కోర్టు తీర్పు
రామగిరి (నల్లగొండ): మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషికి ఉరి శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ముకరమ్ నల్లగొండలోని హైదర్‌ఖాన్‌గూడలో ఉంటూ బీఫ్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నల్లగొండలోని మాన్యంచెల్కకు చెందిన 12 ఏళ్ల బాలిక 2013 మే 28న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
ఎవరూ చూడని సమయంలో ముకరమ్ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తలిదండ్రులకు చెబుతుందేమోనని చున్నీని మెడకు బిగించి కిరాతకంగా హత్య చేసి సమీపంలోని డ్రైనేజీలో మృతదేహాన్ని పడేశాడు. బాలిక తండ్రి సాదిక్‌అలీ చాంద్ ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐ లక్ష్మణ్ దర్యాప్తు చేసి నిందితుడు ముకరమ్‌ను అరెస్టు చేశారు.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ శ్రీవాణిరెడ్డి, శ్రీవాణి దామోదరం వాదనలతో ఏకీభవించిన కోర్టు ముకరమ్‌ను దోషిగా తేల్చి ఉరి శిక్ష విధించింది. అలాగే, రూ.లక్షా పదివేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.
కుమార్తెపై తండ్రి లైంగికదాడి
నిజామాబాద్ జిల్లాలో అమానవీయ ఘటన
నవీపేట: కంటికి రెప్పలా రక్షించాల్సిన కన్న తండ్రే కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని ఓ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంట్లో తన భార్య లేని సమయంలో 11 ఏళ్ల పెద్ద కూతురుకు ఫోన్‌లో అశ్లీల సినిమాలు చూపిస్తూ లైంగికంగా వేధించాడు.
ఇటీవల రాఖీ పండుగ రోజు తల్లి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కూతురు భోరున విలపిస్తూ వెళ్లొద్దని వారించింది. తల్లి ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో విషయం గ్రామపెద్దలకు వివరించగా వారు తండ్రిని హెచ్చరించడంతో భయపడి పరారయ్యాడు. అనంతరం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
7 రోజులు మృత్యువుతో పోరాడి..
కామాంధుడి దారుణానికి బలై ప్రాణాలొదిలిన వృద్ధురాలు
ఆదిలాబాద్ టౌన్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు 78 ఏళ్ల వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడి అనంతరం తోసివేయడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో ఏడు రోజులపాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వృద్ధురాలు భిక్షాటన చేస్తోంది. ఆమెకు కుమారుడు, కోడలు, మనవరాలు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
ఈ నెల 7న ఫుట్‌పాత్‌పై వృద్ధురాలు నిద్రించిన సమయంలో 20 నుంచి 30 ఏళ్లు ఉండే ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, ఏడు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. కాగా, అదే రోజు అర్ధరాత్రి నిందితుడు రైల్లో మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రిమ్స్‌లోని మార్చురీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి వారికి నచ్చజెప్పారు.