
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిది హత్యే అని గుర్తించిన పోలీసులు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడి
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడిని అతడి భార్య, బావమర్ది కలిసి హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ నాగుల ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36), తన స్నేహితుడు మద్దికుంట వీరబాబు ఆదివారం అర్ధరాత్రి భువనగిరి మండలం రాయిగిరి నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ను కారు కొద్దిదూరం లాకెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చున్న వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి మృతదేహాన్ని, గాయపడిన వీరబాబును స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరబాబును మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా సోమావరం ఉదయం మృతుడు స్వామి బాబాయి ఐలయ్య ఈ ప్రమాదంపై పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోటకొండూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కాదని.. వివాహేతర సంబంధం కారణంగానే స్వామిని అతడి భార్య స్వాతి, స్వాతి సోదరుడు మహేష్ కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడు స్వామికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు.