సంస్కరణల్లో తెలంగాణ నం.3

Municipal Administration In Telangana Got Third Place In India - Sakshi

పురపాలికల్లో విజయవంతంగా  అమలు చేసిన తెలంగాణ

ఏపీ, మధ్యప్రదేశ్‌ తర్వాత మూడో రాష్ట్రంగా గుర్తింపు

రూ.2,508 కోట్ల అదనపు రుణాలకు కేంద్రం అనుమతి

3 నెలలుగా ఎంతో కష్టపడ్డాం: పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి  

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను పురపాలికల్లో విజయవంతంగా అమలుపరిచిన దేశంలోని మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీని ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి రూ.2,508 కోట్ల అదనపు రుణాలను సమీకరించ డానికి రాష్ట్రం అర్హత సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం గురువారం ఈ మేరకు అనుమతి జారీ చేసింది. ఈ సంస్కరణ లను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ పూర్తి చేయగా, ఈ జాబితాలో చేరిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం రూ.7,406 కోట్ల అదనపు రుణాలు సమీకరించుకోవడానికి అర్హత పొం దాయి. ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశుద్ధ్య సేవలను అందించేందుకు వీలుగా పురపాలి కలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సంస్కరణలు దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.

ఆ సంస్కరణలివే..
సంస్కరణల కోసం నాలుగు పౌర–కేంద్రీకృత ప్రాంతాలను కేంద్రం గుర్తించింది. అవి.. వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ వ్యవస్థ అమలు, వ్యాపార సంస్కరణల సులభతరం, పట్టణ స్థానిక సంస్థ/ యుటిలిటీ సంస్కరణలు, విద్యుత్‌ రంగ సంస్కర ణలు.. కోవిడ్‌ మహమ్మారితో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు ఊరట కలిగించేందుకు కేంద్రం 2020 మే 17న ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం పేర్కొన్న సంస్కరణలను అమలు పరిస్తే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 2% అదనపు రుణాలను ఆయా రాష్ట్రాలు పొంద డానికి అర్హత సాధిస్తాయని అప్పట్లో తెలియజేసింది. ఈ సంస్కరణల అమలులో భాగంగా ఆస్తుల మార్కెట్‌ విలువను ప్రామాణికంగా తీసుకుని వాటి వైశాల్యం (ఫ్లోర్‌ ఏరియా) ఎంత ఉంటే ఆ మేరకు ఆస్తి పన్నులు విధించేలా పురపాలికల్లో ఆస్తి పన్నుల రేట్లను ప్రకటించాలని కేంద్రం పేర్కొంది.

నీటి సరఫరా, డ్రైనేజీ, మురుగునీటి ప్రవాహ సేవలకు ప్రస్తుతం అవుతున్న వ్యయం ఆధారంగా వీటికి సంబంధిం చిన చార్జీలను సైతం ఫ్లోర్‌ ఏరియా ఆధారంగా విధించాలని నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు 10 రాష్ట్రాలు ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’వ్యవస్థను అమలు చేశాయి. 7 రాష్ట్రాలు సులభ వ్యాపార సంస్కరణలు అమలు చేశాయి. 3 రాష్ట్రాలు మాత్రమే నాలుగింటిలో మూడు సంస్కరణలను అమలు చేశాయి. కాగా, కేంద్రం నిర్దేశించిన సంస్కరణల అమలుకు గత మూడు నెలలుగా తీవ్రంగా కష్టపడ్డామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top