తోడు లేదు.. నీడ లేదు..

Mother Of Children Departed With The Effect Of Covid In Jagtial - Sakshi

సాక్షి, మల్యాల(జగిత్యాల): వేలు పట్టుకొని నడిపించిన నాన్న లేడు.. ఆకలి వేస్తే తినిపించే అమ్మ లేదు.. ఉండడానికి ఇల్లు లేదు.. చదువుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అమ్మానాన్న వైద్యం కోసం చేసిన అప్పులు మిగిలాయి.. అనారోగ్యంతో తండ్రి, కరోనాతో తల్లి మృతిచెందగా ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. భవిష్యత్‌ అంధకారమైంది. ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. మల్యాల మండలం ఒబులాపూర్‌ గ్రామానికి చెందిన గాదె శ్యాంసుందర్‌ తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి భార్య లావణ్య ఒకవైపు బీడీలు చేస్తూ, మరోవైపు బీడీల కంపెనీ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఆమెను ఇటీవల కరోనా బలి తీసుకుంది. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.

అప్పులే మిగిలాయి..
శ్యాంసుందర్‌ బీడీ కంపెనీ నడుపుతూ పచ్చకామెర్ల బారినపడ్డాడు. చికిత్స కోసం తమకున్న రెండు గుంటల భూమిని అమ్మినా ప్రాణాలు దక్కలేదు. దీంతో కుటుంబ భారం లావణ్యపై పడింది. ఇద్దరు పిల్ల లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, భర్త వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రాత్రివేళల్లో బీడీలు చేస్తూ, పొగాకు ప్రభావంతో ఛాతి సంబంధిత వ్యాధి బారిన పడింది. ఆక్సిజన్‌ థెరపీ అవసరం కావడంతో నెల రోజులు ఆస్పత్రిలో వైద్యం పొందింది. రూ.3లక్షలు అప్పు చేసి, చికిత్స తీసుకుంటున్న క్రమంలో కరోనా బారిన పడి ఈ నెల 2న చనిపోయింది.

కూతురు హారిక గర్రెపల్లి గురుకుల పాఠశాలలో ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. కుమారుడు రామకృష్ణ మల్యాల మండలం నూకపల్లి మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఉండడానికి ఇల్లు లేదు. గుంట భూమి లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువుల ఇళ్లలోనే అద్దెకుంటున్నారు. పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. తల్లిదండ్రుల మృతితో హారిక, రామకృష్ణ దిక్కులేని పక్షులయ్యారు. ఒకవైపు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బాధ, మరోవైపు అప్పులు తీర్చే దారి కానరావడం లేదు. దాతలు దారిచూపాలని, బతుకు బాట సాగేందుకు ఆర్థిక చేయూత కోసం చిన్నారులు ఎదురుచూస్తున్నారు. ఎంతోమంది నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపుతూ, మేమున్నామంటూ భరోసానిస్తున్న మంత్రి కేటీఆర్, ఈ చిన్నారులను సైతం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top